జనం గుండెల్లో ఎలిఫెంట్‌ జోన్‌ కుంపటి

Mar 19,2025 21:02

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఉంది మన్యం జిల్లాలో ఏనుగుల వ్యవహారం. ఏనుగులను తరలించడంలో విఫలమైన ప్రభుత్వం, అటవీశాఖ.. జనం గుండెల్లో ఎలిఫెంట్‌ జోన్‌ కుంపటి పెడుతున్నాయి. ఏనుగుల కోసం ప్రత్యేకంగా జోన్‌ ఏర్పాటుకు పూనుకోవడమే అందుకు కారణం. అమ్మాదేవి కొండ వద్ద ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. అక్కడి భూములను సాగుచేసుకుంటూ జీవనం గడుపుతున్న రైతులను వెళ్లగొట్టేందుకు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామస్తులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటై, ప్రజా సంఘాల ఆధ్వర్యాన పోరుబాట పట్టారు.

ప్రజాశక్తి-పార్వతీపురం: జిల్లాలో గత కొన్నేళ్లుగా అడవి ఏనుగుల గుంపు సంచారంతో ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవిస్తున్నాయి. కొమరాడ, కురుపాం, సీతంపేట, పార్వతీపురం, గుమ్మలకీëపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, తదితర మండలాల్లో ఇంతవరకు ఏనుగులు విధ్వంసాలకు పాల్పడ్డాయి. ఒడిశా నుంచి వచ్చిన ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాని స్థావరంగా ఏర్పాటు చేసుకుని ఏజెన్సీ మండలాల ప్రజలను, గిరిజనులను హడలెత్తిస్తున్నాయి. ఏరోజు ఎటువైపు దారి తీస్తాయో తెలియని పరిస్థితుల్లో వాటి గమనాన్ని కనిపెట్టుకుంటూ అటవీ సిబ్బంది ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి జిల్లాని వెంటాడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బాధిత గ్రామాల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంతవరకు ఏనుగుల దాడిలో 13 మంది మృతిచెందారు. లక్షలాది రూపాయల ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం కూడా కొంతమేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీ చేస్తోంది. చివరికి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామంటూ అటవీశాఖ అధికారులు ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అమ్మాదేవి కొండ చుట్టూ ఏనుగుల కోసం ఓ జోన్‌ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు. దీనిలో భాగంగా కొద్దిరోజులుగా కొండ చుట్టూ జెసిబిలతో ట్రెంచ్‌ పనులు చేపడుతున్నారు. భయం ముంగిటసుమారు 1100 ఎకరాల్లో ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇదే జరిగితే సీతానగరం మండలంలోని పలు గ్రామాల భూములు ఎలిఫెంట్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల తమ జీవనాధారమైన భూములు, తోటలు కోల్పోతామని సీతానగరం మండలంలోని రేపటివలస, అప్పయ్యపేట, గుచ్చిమి, చిన్నరాయుడుపేట, తామరకండి, తానసీతారాంపురం గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుచేస్తే తమ పరిస్థితి ఏమిటోనన్న భయా ందోళనకు గురవుతున్నారు.ఆందోళన బాట ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటును అడ్డుకునేందుకు ఆయా గ్రామస్తులు, నాయకులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి పోరుబాట పట్టారు. ప్రజాసంఘాల మద్దతుతో ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన బాధిత ప్రజలు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా సోమవారం పార్వతీపురంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, ర్యాలీ నిర్వహించారు. డిఎఫ్‌ఒ ప్రసూన, కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించారు. ఆ జోన్‌ పనులు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.ట్రెంచ్‌ పనులు అడ్డగింతఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుకు సంబంధించి జెసిబిలతో అటవీశాఖ అధికారులు ట్రెంచ్‌ పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు, ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు రైతు సంఘం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, సిఐటియు నాయకులు రెడ్డి వేణు ఆధ్వర్యాన మంగళవారం ట్రెంచ్‌ పనులు అడ్డుకున్నారు. జెసిబిలకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 13న అప్పయ్యపేట వద్ద పనులు చేస్తున్న యంత్రాలను అడ్డుకున్నారు. అటవీ అధికారులకు పనులు చేపట్టవద్దని, ఏమైనా పనులు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినా అటవీశాఖ అధికారులు మొండిగా ముందుకెళ్లడంపై ఆయా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ బతుకులు బుగ్గిపాలు చేసే ఎలిఫెంట్‌ జోన్‌ పనులు నిలిపివేయాలని, లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహిళలు హెచ్చరించారు. ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.

అటవీ అధికారులతో చర్చలు

పార్వతీపురం : సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటుపై సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, అటవీ రేంజ్‌ అధికారి రామ్‌నరేష్‌ మధ్య చర్చలు జరిగాయి. ఎలిఫెంట్‌ జోన్‌ కోసం చేపడుతున్న ట్రెంచ్‌ పనులను మంగళవారం ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానికులు, రైతులు అడ్డుకున్నారు. దళితులు, గిరిజనులు, పేదలు సాగుచేస్తున్న భూములకు నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం కావడంతో వారు ఎలిఫెంట్‌ జోన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. పనులు అడ్డుకోవద్దని, గ్రామాల ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని అటవీ అధికారులు చెప్పారు. దీంతో బుధవారం స్థానిక అటవీ రేంజ్‌ అధికారి కార్యాలయంలో ఇరువురి మధ్య చర్చలు నిర్వహించారు. భూములు సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అటవీ రేంజ్‌ అధికారి రామ్‌ నరేష్‌ చెప్పారు. ఆ విషయాన్ని గ్రామాల ప్రజల సమక్షంలో చెప్పాలని, వారు అంగీకరిస్తే అభ్యంతరం లేదని ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా నాయకులు రెడ్డి వేణు, మండల నాయకులు రెడ్డి ఈశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మరోసారి సమీప గ్రామాల ప్రజల సమక్షంలో అటవీశాఖ అధికారులు, ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చర్చలు జరపనున్నారు.

 

➡️