టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి : పిఒ

Mar 13,2025 21:03

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్‌ విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలను సాధించాలని ఐటిడిఎ పిఒ అశుతోష్‌ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. మండలంలోని రావికోనలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను పిఒ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఆ పరీక్షలకు విద్యార్థులు మంచిగా చదివి ఉత్తమ ఫలితాలు పొందాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఇష్టంగా చదవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలన్నారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి ఒత్తిళ్లకు గురికావద్దని హితవు పలికారు. ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే పదో తరగతి పునాది అని, అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. అనంతరం స్టడీ అవర్‌లో ఉన్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షించి, టెన్త్‌లో మంచి విజయం సాధించాలని విద్యార్థులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఈ పర్యటనలో ఆశ్రమ ఉన్నత పాఠశాల వార్డెన్‌, విద్యార్థులు ఉన్నారు.ఉత్తమ ఫలితాలు సాధించాలి సీతానగరం: ఇష్టంతో చదివితే విషయ అవగాహన సులభంగా వస్తుందని తద్వారా ఉత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌ రూపవతి అన్నారు. మండలంలోని జోగంపేట డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పాఠశాలను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీద పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, అట్టలను పంపిణీ చేశారు. ఈ మేరకు ఆమె 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలపై తగు సూచనలు సలహాలను అందజేశారు. విద్యార్థులు సందేహాలుంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలన్న పట్టుదలతో ఉన్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులు చక్కగా చదివి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ మధు, వైస్‌ ప్రిన్సిపల్‌ ఈశ్వరరావుతోపాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️