సీతంపేట: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో చేపడుతున్న రోడ్డు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. అదే విధంగా పనుల్లో నాణ్యత లోపించకూడదని అన్నారు. పనుల ప్రారంభానికి ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించుకొని పనులు ప్రారంభించాలని సూచించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి మంజూరైన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ రమాదేవి, పంచాయతీరాజ్ ఇఇ రవి, డిఇలు సింహాచలం, రాధారాణి, లోకనాథం, ఎఇలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
