ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : గుమ్మలక్ష్మీపురం మన్యంలో విష జ్వరాలు వీడటం లేదు. విద్యార్థుల నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడుతున్నారు. సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉండడంతో చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతున్నాయి. వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, కాళ్ల పీకులు, తలనొప్పి వంటి లక్షణాలతో గిరిజనులు బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. భద్రగిరిలో రోజువారి ఒపి 200 వరకు నమోదు అవుతుంది. ఏజెన్సీకి కేంద్ర బిందువుగా ఉన్న భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రి 50 పడకలుగా రూపాంతరం చెందినా, రోగులకు 35 మంచాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎటూ చాలని పరిస్థితి. రోగులు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క మంచంపై ఇద్దరు, ముగ్గురికి వైద్యం అందిస్తున్నారు. సీరియస్ కేసులు వస్తే పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం వంటి దూరప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో 12 మంది వైద్యులు ఉండాలి. కానీ, ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆస్పత్రి సమీపంలోని రూ.9.90 కోట్లతో నూతనంగా వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవన నిర్మాణం పూర్తయితే మెరుగైన, అన్ని రకాల సేవలు అందించడానికి వీలుంటుంది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి సేవలు అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
