ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

May 13,2024 22:16

కురుపాం: నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 268 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 66.57శాతం పోలింగ్‌శాతం నమోదైంది. నియోజకవర్గంలోని 1,94,114 మందికి గానూ, 1,29,223మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, శివన్న పేట పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య కొద్దిపాటి తోపులాట జరిగింది. ఆ సమయంలో సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ షణ్ముఖ రావు పోలీసు సిబ్బందితో ఇరువర్గాలను సద్దుమణిగి చేశారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది.ఓటు హక్కు వినియోగించుకున్న వైరిచర్ల కురుపాం:కురుపాం శివన్న పేట, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్ర దేవ్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్ర దేవ్‌, మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్‌ దేవ్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం ో సమానం అని… అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛ గా వినియోగించు కోవాలని సూచించారు.ప్రశాంతంగా ఓటింగ్‌..గుమ్మలక్ష్మీపురం : మండలంలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. 27 పంచాయతీల్లో 52 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవిఎంలు మొరాయించడంతో తాడికొండలో 45 నిమిషాలు, లాడలో రెండు గంటల పాటు ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. చాపరాయి బిన్నిడి, కె.శివడ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు వేసేందుకు రావడంతో గంటలు తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులుకురుపాం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ సవరకోటపాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిడిపి అభ్యర్థి తోయక జగదీశ్వరి తాడికొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గిరిజన ఓటర్లలో చైతన్యంగతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికల్లో గిరిజన ఓటరు చైతన్యం కనిపించింది. పోలింగ్‌ కేంద్రానికి ఏడు గంటల నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలైన్‌లో ఉండటం విశేషం. తాడికొండ, కేదారిపురం, వంగర, ఇరిడి, కే శివడ, కొత్తగూడ, కొండవాడ పోలింగ్‌ కేంద్రాల వద్ద గిరిజనులు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇవిఎంలు మోరాయించిన వీరు సహనంతో క్యూలైన్లో నిలబడే కనిపించారు. గిరిజనుల్లో అక్షరాస్యత పెరగడం సామాజిక చైతన్యం పెరిగినందున పోలింగ్‌ శాతం పెరుగుతుందని పరీక్షలకు భావిస్తున్నారు.ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధులుమండలంలోని పెద్దఎత్తున వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుమ్మలక్ష్మీపురం, రేగిడి, దుడ్డుఖల్లు గ్రామాల్లో ఓటర్లు నడవలేని స్థితిలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వారు తోటి వారి సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారు. కొమరాడ : మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 31 గ్రామపంచాయతీల్లో 60 పోలింగ్‌ బూతుల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 60 పోలింగ్‌ బూత్‌లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైనప్పటికీ కొన్ని పోలింగ్‌ బూత్‌లో ఇవిఎంలు మొదట్లో ఆన్‌చేయడం రాక కొంత ఆలస్యమైంది. మరికొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో పోలింగ్‌ ఆలస్యంగా జరిగినట్లు పలువురు తెలిపారు. కొమరాడ, మాదలింగి, విక్రాంపురం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇరు పార్టీ వారికి స్వల్ప ఘర్షణలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘర్షణ పడుతున్న వారిని చెదరగొట్టి ఎటువంటి గొడవలు లేకుండా చేశారు. పోలింగ్‌ కేంద్ర పరిసర ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు ఇతరులను అనుమతించకపోవడంతో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మండలంలోని చోళపదం, కొమరాడ తదితర పోలీస్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు సక్రమంగా కల్పించకపోవడంతో ఓటరుతో పాటు ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచినీరు, భోజనం సదుపాయం కూడా సక్రమంగా లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఓటర్లు ముందుకు వచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ఏర్పాట్లను కొమరాడ ఎస్సై నీలకంఠంతో పలువురు సిఐలు డీఎస్పీలు ఎప్పటికప్పుడు పోలింగ్‌ స్టేషన్లను సందర్శిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్న వారు కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అష్టకష్టాలు పడి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. నత్తనడకన పోలింగ్‌జియ్యమ్మవలస: మండలం లోని మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్‌ నత్తనడకన సాగింది. మండలంలో 59పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌లో 30శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఏజెంట్లు ఆలస్యంగా విధులకు హాజరవ్వడంతో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డలతో ఓటు వేసేందుకు అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా పెదబుడ్డిడి ,శిఖబడి గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో చినకుదమలో తీవ్ర ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని ముందుస్తుగా పోలీసలు బందోబస్తు భారీగా మొహరించారు. చినమేరంగిలో వైసిపి అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి తన ఓటును వినియోగించుకున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజు తన ఓటును వనిజలో వేశారు.

➡️