28న ప్రజ్ఞా వికాస పరీక్ష : ఎస్‌ఎఫ్‌ఐ

Feb 4,2025 21:37

ప్రజాశక్తి – కురుపాం: ఫిబ్రవరి 8న జరిగే ప్రజ్ఞా వికాసం పరీక్షకు పదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కురుపాం మండల బాధ్యులు ఆరిక గంగారావు పిలుపునిచ్చారు. మండలంలోని మొండెంఖల్‌ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రజ్ఞ వికాస్‌ పరీక్షపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ముందు ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పబ్లిక్‌ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనివల్ల పదో తరగతి విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పబ్లిక్‌ పరీక్షలపై ఒక మంచి అవగాహన వస్తుందని విద్యార్థులకు ప్రోత్సాహంగా బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతికి రూ.3వేలు, తృతీయ బహుమతి కింద రూ. 2వేలు నగదు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే మండలాల వారీగా మెమోంటోలు కూడా ఇస్తామన్నారు. కావున విద్యార్థులంతా ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️