ప్లాస్టిక్‌ను నివారిద్దాం…కేన్సర్‌ను తరిమేద్దాం

Feb 4,2025 21:36

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ప్లాస్టిక్‌ను వాడడం వల్లే కేన్సర్‌ బారిన పడాల్సి వస్తుందని, కావున ప్లాస్టిక్‌ను నివారించి ఆ వ్యాధిని జయిద్దామని ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌, ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ పార్వతీపురం, విజయనగరం అసోసియేషన్‌ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలో కేన్సర్‌ నివారణకై అవగాహన ర్యాలీని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రతి పనికి ప్రజలు ప్లాస్టిక్‌ కవర్లను వాడడం అలవాటుగా మారిపోయిందన్నారు. దీని కారణంగానే మనం కేన్సర్‌ బారినపడాల్సి వస్తుందన్నారు. ప్రధానంగా ఆహార పదార్థాలకు కవర్లు ఉపయోగించడం వల్ల, ప్లాస్టిక్‌ తగలబెట్టడం వల్ల కాలుష్య కారకవాయువులు వెలువడుతాయన్నారు. ప్రధానంగా కేన్సర్‌, గుండె జబ్బులు, జీర్ణాశయం, పేగు వ్యాధులు, ఊపిరితిత్తులు, నరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం కేన్సర్‌ అన్నారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల గొంతు కేన్సర్‌, థైరాయిడ్‌, రొమ్ము, ఊపిరితిత్తులు, లివర్‌, గర్భాశయానికి సంబంధించిన కేన్సర్‌ వ్యాధులు వస్తాయన్నారు. కావున ప్రజలు కేన్సర్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేన్సర్‌ కారకాలైన ధూమపానం, మద్యపానం, ప్లాస్టిక్‌ వాడకాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని కేన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సింహాచలం, కార్యదర్శి నడిమింటి గోపాలనాయుడు, ఉపాధ్యక్షులు వానపల్లి శంకరరావు, సహాయ కార్యదర్శి బివి నాయుడు, ట్రెజరర్‌ బి.తులసీదాస్‌, జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు.

➡️