పార్వతీపురం రూరల్ : కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బివి రమణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, పథకాల్లో లక్షలాదిమంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, కంటింజెంట్ పద్ధతుల్లో పనిచేస్తున్నారని, వీరికి మినిమం టైమ్ స్కేల్, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుని చట్ట ప్రకారం చెల్లించాల్సిన జీతాలు, ఇతర హక్కులు కల్పించడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చెల్లించకుండా ఉద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఆప్కాస్ విధానాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు అమ్మబడి, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ వంటి పద్ధతుల్లో పనిచేస్తున్న అందరిని రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్ చేసే వరకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, సంక్షేమ పథకాలన్నీ ఈ ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్తులో సిఐటియు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, కోశాధికారి గొర్లి వెంకటరమణ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఎం.ప్రసాద్, సూర్యనారాయణ, జి.బాలకృష్ణ, వై.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.