‘గిరిజన విద్య కోసం రూ.కోట్లు కుమ్మరిస్తున్నాం. కెజి నుంచి పిజి వరకు అంతా ప్రభుత్వమే చదివిస్తుంద’ంటూ మన పాలకులు గొప్పలు చెబుతున్నారు. ఆచరణకొచ్చే సరికి మచ్చుకైనా అవేవీ కనిపించడం లేదు. 11 ఏళ్లుగా సీతంపేట జిఎంఆర్ పాలిటెక్నికల్ కళాశాలకు లెక్చరర్ పోస్టులు మంజూరుకాక, సరైన సదుపాయాలు లేక విద్యార్థులు మొగ్గు చూపడం లేదు. బోధకులు, ల్యాబులు లేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. బోధకులు, బోధనేతర సిబ్బంది అంతా డెప్యుటేషన్‌పై నడిపిస్తున్నారు.
ప్రజాశక్తి-సీతంపేట: పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నికల్‌లో చేరే వారి ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. పాలిటెక్నిక్‌లో చేరేందుకు విద్యార్థులు శిక్షణ సైతం పొందుతున్నారు. ఇదివరకే దరఖాస్తులూ చేసుకున్నారు. ఈ నెల 30న పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాయడానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. జులై మొదటి వారంలో పాలిటెక్నికల్ కౌన్సిలింగ్, రెండో వారంలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పాలిటెక్నికల్ కళాశాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్ది ఉండాల్సి ఉంది. కానీ, సీతంపేటలోని జిఎంఆర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నికల్ కళాశాల అందుకు భిన్నంగా ఉంది. 2014 పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేశారు. సీతంపేట ఐటిడిఎ సమీపంలో పాత భవనాల్లో పాలిటెక్నికల్ కళాశాలను 2018 వరకు నడిపించారు. ఆ తర్వాత మండల కేంద్రంలో నౌగూడ సమీపంలో రెండంతస్తుల భవనం నిర్మించారు. ఇప్పటికీ రెండో అంతస్తు భవనం ఫ్లోరింగ్, విద్యుత్తు పనులు పూర్తికాలేదు. దీంతో ఏడేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిఎంఆర్ పాలిటెక్నికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క కోర్సుకు 54 సీట్లు చొప్పున రెండు కోర్సులకు 108 సీట్లు కేటాయించారు. ప్రస్తుతం 47 మంది విద్యార్థులు ఇక్కడ పాలిటెక్నికల్ విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు రెసిడెన్షియల్ సదుపాయం కూడా కల్పించారు. గిరిజన విద్యార్థులకు 75 శాతం, ఇతర విద్యార్థులకు 25 శాతం అవకాశం కల్పించారు. అంతవరకు బాగానే ఉంది.వేధిస్తున్న బోధకుల కొరతమెకానికల్ ఇంజినీరింగ్‌కి నలుగురు లెక్చరర్లు ఉండాలి. ముగ్గురు డెప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌కి నలుగురు బోధకులు ఉండాలి. ఇద్దరితోనే, అది కూడా డెప్యుటేషన్‌పైనే నెట్టుకొస్తున్నారు. పాలిటెక్నికల్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులను సిఆర్‌టిలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాలిటెక్నికల్ కళాశాలలో మూడు రోజులు, సీతంపేట పాలిటెక్నికల్ కళాశాలలో మూడు రోజులు బోధిస్తారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ బివిఎస్‌ఎన్ మూర్తి డెప్యుటేషన్‌పైనే ఒఎస్‌డిగా కొనసాగుతున్నారు. కళాశాల మంజూరు చేసి 11 ఏళ్లు గడుస్తున్నా పోస్టులు మంజూరు కాకపోవడం గమనార్హం. ఇక బోధనేతర సిబ్బంది గురించి చెప్పనవసరం లేదు. కార్యాలయ సిబ్బంది అంతా అవుట్ సోర్సింగ్, డెప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు.