ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పట్టణంలోని సారికవీధిలో మూడు వారాలుగా మూతబడిన భారత్ గ్యాస్ ఆఫీసు తెరిపించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు గొర్లి వెంకటరమణ, పాకల సన్యాసిరావు డిమాండ్. చేశారు. బుధవారం గ్యాస్ లబ్ధిదారులతో కలిసి భారత్ గ్యాస్, తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ, సుదూర ప్రాంతాల లబ్ధిదారులు సుమారు 800 మంది గత 25 రోజులుగా ఇండెంట్లు పెట్టినా, నేటికీ సిలిండర్లు సరఫరా చేయడం లేదన్నారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసు మూడు వారాలుగా తెరవడం లేదని చెప్పారు. ఆఫీసు ఫోన్లు పని చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనంతరం తహశీల్దార్ జయలక్ష్మికి సమస్యను వివరించారు. అనంతరం సివిల్ సప్లై ఉపతహశీల్దారుతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంచాన ఉమామహేశ్వరరావు, బంకురు సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
