పార్వతీపురం టౌన్ : తమపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న రాజకీయ నాయకుడితో పాటు అధికారుల నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని పట్టణంలో కొత్తవలసలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు కొండేటి రాధ, రెడ్డి హేమ, అగ్గాల స్వాతి, బొండపల్లి సుశీలమ్మ, అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న ఇల్లా జ్యోతి కోరారు. ఈ మేరకు స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి గురువారం వారు సిపిఎం నాయకులు వి.ఇందిర, బంకులు సూరిబాబుతో కలిసి జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని కొత్తవలసలో విజయరామరాజు కాలనీ గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహకులుగా గత మూడేళ్ల నుంచి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న తమపై ఐదో వార్డు టిడిపి కౌన్సిలర్ భర్త కోలా మధు తమను విధుల నుంచి తప్పించే భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో తమను విధుల నుంచి ఆగిపోమ్మని చెబుతున్నారని, మూడేళ్లుగా విధులు నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నామని అన్నారు. అర్ధాంతరంగా మమ్మల్ని ఆగిపోమని చెప్పడం అన్యాయమని, ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.