ఉద్యోగ భద్రత కల్పించండి చంద్రన్నా!

Nov 30,2024 21:05

ప్రజాశక్తి -పార్వతీపురం: డిఎస్‌సి నుంచి తమ పోస్టులు మినహాయించి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ముఖ్యమంత్రిని వేడుకొన్నారు. ఈ మేరకు స్థానిక ఐటిడిఎ కార్యాలయం ఎదుట గల అడవి తల్లి విగ్రహం ఎదుట బిక్షాటన నిర్వహించారు. చంద్రన్న మమ్మల్ని ఆదుకోండి అని నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతిపాదిత డిఎస్‌సి నుంచి తమ పోస్టులు మినహాయించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ రాష్ట్ర అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే ఉపశమహరించుకోవాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమను కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు దీక్ష శిబిరం వద్ద గురజాడ అప్పారావు వర్ధంతి సందర్బంగా గురజాడ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, దివాకర్‌, రమేష్‌, రాజేష్‌, వెంకట్‌, బిందు మాధవి, లక్ష్మి, మురళి, శ్రీను, కవిత, సీత, ఉమా, జ్యోతి, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.అవుట్సోర్సింగ్‌ సిబ్బందికి న్యాయం చేయాలి పార్వతీపురంరూరల్‌ : తమ న్యాయమైన హక్కులకై నిరసన దీక్ష చేస్తున్న గురుకుల పాఠశాలల్లో పని చేసే ఔట్సోర్సింగ్‌ సిబ్బందికి న్యాయం చేయాలని ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్‌, బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గల 1636 మంది సిబ్బంది అరకొర వేతనాలతో గత 15 ఏళ్లుగా రెగ్యులర్‌ సిబ్బందితో పాటు గిరిజన విద్యార్థుల అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. వీరికి తగిన న్యాయం చేయకపోవడం వల్ల శాంతియుత నిరసన తెలియజేస్తున్నారని, ఔట్సోర్సింగ్‌ సిబ్బందితో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గురుకుల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు అన్యాయం చేయడం సరికాదని వీరు హితవు పలికారు.మోకాళ్లపై నిలుచుని నిరసనసీతంపేట: స్థానిక ఐటిడిఏ ముఖద్వారం వద్ద అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. దీంతో పాటు దీక్ష నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్‌, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️