రోడ్డు పనులు పూర్తి చేయాలి

Apr 13,2025 21:45

ప్రజాశక్తి – గరుగుబిల్లి : ప్రధాన రహదారుల మరమ్మతులకు గురైన రోడ్ల పనులను ప్రారంభించి మధ్యలో నిలిపివేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామస్వామి అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు పి.రాజశేఖర్‌తో కలిసి ఆదివారం అడ్డాపుశిల ప్రధాన రహదారి నుండి తోటపల్లి రిజర్వాయర్‌, ఉల్లిబద్ర, ఎర్రన్నగుడి జంక్షన్‌ పైబడి వరకు గల రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కె.రామస్వామి మాట్లాడుతూ అడ్డాపుశిల ప్రధాన రహదారి నుంచి ఎర్రన్నగుడి జంక్షన్‌ పైబడి వరకు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని, నిర్మాణ పనులు చేపట్టేందుకు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేయడం అన్యాయమని మండిపడ్డారు. రోడ్లు, భవన నిర్మాణ శాఖ అధికారులు రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లు నిర్మాణ పనుల కోసం బూడిద కంకరాళ్లు వేయడంతో దాని ద్వారా వచ్చే దుమ్మూ ధూళి వల్ల పాదచారులకు, వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. వాహనాల వేగం వల్ల రాళ్లు ఎగురుకుంటూ ప్రయాణికులపై పడే ప్రమాదం గతంలో జరిగిందని, దీనివల్ల అనేక మంది గాయాలపాలైనట్టు స్థానిక వ్యాపారస్తులు తెలిపారని అన్నారు. వాహనాల రాకపోకల వల్ల దుమ్మూ, ధూళి పెరగడంతో ఎదురుగావచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదని, దానివల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండదని వివరించారు. కావున వెంటనే ఆర్‌ అండ్‌ బి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. నాటి వైసిపి ప్రభుత్వ హయాంలో రోడ్లు గుంతలుగా తయారవ్వడంతో, అధికారం చేపట్టిన వెంటనే ప్రతి రోడ్డు మరమ్మతులు చేపట్టి, సుందరంగా తీర్చిదిద్దుతామని నేటి టిడిపి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ దాన్ని పూర్తిగా విస్మరించిందని వాపోయారు. కావున వెంటనే జిల్లా అధికారులు ప్రధాన రహదారులపై దృష్టి సారించి, బడ్జెట్లలో అత్యధిక నిధులను కేటాయించి, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

➡️