ప్రజాశక్తి – సాలూరురూరల్ : జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్విపర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్వీపర్ల యూనియన్ కార్యదర్శి రంగుముద్రి లక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు కోరారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో స్వీపర్లతో సమావేశం జరిగింది. తొలుత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న రూ.6వేలు జీతాన్ని ప్రతినెలా 5తేదీలోగా చెల్లించాలని, మూడు నెలలుగా ఉన్న బకాయిలను ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వయసు పెరుగుతున్న వర్కర్ల కుటుంబ సభ్యులకు పనిచేందుకు అవకాశం ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ వర్తింపచేయాలని కోరారు. పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేసి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు అబద్ధం, మంగమ్మ, అచ్చియమ్మ తదితరులు పాల్గొన్నారు.