నకిలీ విత్తనాలతో తీవ్ర నష్టం

Oct 2,2024 21:43

ప్రజాశక్తి-మక్కువ : నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని మోసగించిన వారిపై కేసులు పెట్టాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తాడంగి ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మక్కువ మండలం నంద గ్రామంలో 15 మంది గిరిజన రైతుల వేసిన నకిలీ విత్తనాలతో పాడైన మొక్కజొన్న పంటను బుధవారం వారు పరిశీలించారు ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ మక్కువలో గ్రంధి గున్నరాజు, కొంచాడ శ్రీనివాసరావు వ్యాపారుల వద్ద అడ్వెంట్‌ 9293 కంపెనీ మొక్కజొన్న విత్తనాలను రైతులు కొనుగోలు చేసి, సుమారు 30 ఎకరాల్లో నాటారని తెలిపారు. విత్తనం నాటిన తరువాత ఎదుగుదల మందగించి, పూర్తిగా వెన్ను రాలేదని చెప్పారు. పంట చేతికి వచ్చే సమయానికి గిడస బారిపోయి నాశనం అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విత్తనం నకిలీది కావడం వల్ల పూర్తిగా పంట పాడైందని మండల వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమాయక గిరిజన రైతులను వ్యాపారులు మోసగించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీ విత్తనాలతో గిరిజనులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు రూ75 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బాధిత గిరిజన రైతులు ఉన్నారు.

➡️