ప్రజాశక్తి-పార్వతీపురం : ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి గాంచిన శంబర పోలమాంబ ఉత్సవాలను రాష్ట్ర స్థాయి పండగలా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జాతరకు జిల్లాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా యాత్రికులు తరలివస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పక్కాగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ ఉండరాదని సబ్ కలెక్టర్ అన్నారు. తాగునీటి కుళాయిలు, బోర్లు పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. పారిశుధ్యం పక్కాగా ఉండాలని, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల నుంచి కార్మికులు, వాహనాలను జాతర జరిగే ప్రదేశానికి పంపించాలని సూచించారు. పారుశుధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల తదుపరి రోజుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. అమ్మవారి మారు జాతర ముగిసే వరకు వారంలో ఒక రోజు పారుశుధ్యంపై దృష్టిసారించాలని స్పష్టంచేశారు. జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. వాహనాల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలన్నారు. జాతరలో స్వచ్ఛంద కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్సులు వెళ్లుటకు రహదారి అందుబాటులో ఉండాలని స్పష్టంచేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిమాను తిరిగే రోజున విద్యుత్తు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు ఎటువంటి సమస్యలూ లేకుండా చర్యలు తీసుకోవాలని రహదారులు, భవనాల శాఖ అధికారులకు తెలిపారు. ఎటువంటి కల్తీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిసి టివిలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 23న పెద్దమ్మ వారి చాటింపుతో ప్రారంభమై 2025 ఏప్రిల్ ఒకటో తేదీన జరిగే చండి హోమం, మహాన్నదానంతో ఉత్సవాలు ముగుస్తాయని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా జనవరి 27న తొలేళ్ల ఉత్సవం, 28న అమ్మవారి సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం జరుగుతాయని వివరించారు. సాలూరు రూరల్ సిఐ పి.రామకృష్ణ మాట్లాడుతూ ముగ్గురు డిఎస్‌పిలు, 14 మంది సిఐలు, 42 మంది ఎస్‌ఐలతో సహా మొత్తం 700 మందిని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విపత్తు స్పందన అధికారి కె.శ్రీనివాసబాబు, ఆర్‌అండ్‌బి ఇఇ కె.సుబ్బారావు. సాలూరు ఎక్సైజ్ సిఐ జి.దాస్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ పి.ఎం.కె రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఎం.శశి కుమార్, సాలూరు డిపో మేనేజర్ ఎ.భాస్కర్‌రెడ్డి, శంబర మెడికల్ ఆఫీసర్ పి.రమ్య సాయి, మక్కువ తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, ఇఒపిఆర్‌డి దేవకుమార్, శంబర పొలమాంబ దేవాలయాల ఇఒ వి.వి.నారాయణ, దేవస్థానం మాజీ చైర్మన్ పూడి దాలినాయుడు, శంబర ఎంపిటిసి తీళ్ల పోలినాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
