ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్ర జాతరగా అవతరించి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాలు కొంగత్త హంగులు సంతరించుకుని ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న జాతరకు శంబర ముస్తాబవుతోంది. గతేడాది కంటే భిన్నంగా సుమారు రూ.2.40కోట్లు నిధులతో వనం గుడి, చదురు గుడుల వద్ద, అలాగే గ్రామంలోని సిరిమాను తిరిగే ప్రధాన రహదారులు విశాలంగా నిర్మించారు. ఈసారి అమ్మవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదురుగుడి సమీపంలో క్యూలైన్‌లో వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కేశఖండన చేసే ప్రాంతాన్ని కూడా చదును చేసి విశాల ఫ్లాట్ ఫాంలు నిర్మించారు. ఇదిలా ఉండగా వనం గుడి వద్ద రహదారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను ఇటీవలే తొలగించారు. దీంతో అక్కడ రహదారి విశాలంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించేలా పనులు చేస్తున్నారు.కమిటీపై కాలయాపన ఎందుకో..?గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జాతర విషయంలో కూడా కమిటీ ఏర్పాటులో కాలయాపన జరుగుతోందని సర్వత్రా విమర్శలు వెళ్తువెత్తుతున్నాయి. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయికి అభివృద్ధి చెందిన జాతరగా గుర్తింపు పొందినప్పటికీ కమిటీ నియామకంలో తాత్సరం ఎందుకు జరుగుతోందనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జాతర ప్రారంభానికి పది రోజులే గడువున్నప్పటికీ ఉత్సవ కమిటీ ఏర్పాటుకు అడుగులు పడడం లేదు. రాజకీయంగా ముడిపడి ఉన్న కమిటీ ఏర్పాటుపై టిడిపి నాయకత్వానికి స్పష్టత లేకపోవడం ఒకంత ఆశ్చర్యానికి తావిస్తోందని పలువురు భావిస్తున్నారు. గ్రామ స్థాయిలో కమిటీ లేకుండా జాతర నిర్వహణ జరిగినట్లయితే ఇది కూడా ఒక చరిత్రగా చెప్పుకోవచ్చన్నది మరి కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.
