సాలూరు: వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసుల ఆగడాలు మళ్లీ శృతిమించుతున్నాయి. గత కొద్దిరోజులుగా కొటియా పోలీసులు అధికారులు చేపడుతున్న కవ్వింపు చర్యలు ఎపి అధికారులు, పోలీసులకు తలనొప్పిగా మారాయి. గత కొంతకాలంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న వివాదాస్పద గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎపి, ఒడిశా రాష్ట్రాల్లో 8 నెలల క్రితం కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఎన్డీయే కూటమిలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఎపిలో అధికారంలో ఉండగా, ఒడిశాలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో ఒడిశా పోలీసులు, అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అనేక దుశ్చర్యలకు పాల్పడ్డాయి. ఎపి ప్రభుత్వం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం, అభివృద్ధి పనులు జరగకుండా ఆటంకపర్చడం వంటి చర్యలకు ఒడిశా పోలీసులు అధికారులు తెగబడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ అలాంటి చర్యలకే ఒడిశా పోలీసులు, అధికారులు దిగుతున్నారు. వారం రోజుల క్రితం గంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని దిగువ శెంబిలో గల అంగన్వాడీ కేంద్రం నుంచి కొటియా పోలీసులు, అధికారులు కొన్ని మ్యాపులను, పుస్తకాలను తీసుకెళ్లారు. ఈ సంఘటన మరువకముందే ఒడిశా పోలీసులు శనివారం గంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని దూళిభద్రలో మరో దురాగతానికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో దూళిభద్రలో జలజీవన్ మిషన్ కింద నిర్మాణమవుతున్న వాటర్ ట్యాంక్ సామగ్రిని, సిమెంట్‌ను వ్యాన్‌తో సహా తీసుకెళ్లారు. ఎపి ప్రభుత్వం దూళిభద్రలో జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపడుతోంది. సాలూరుకు చెందిన కాంట్రాక్టర్ రామకృష్ణ ఈ పనులు చేస్తున్నారు. వ్యాన్‌లో సిమెంట్, ఇనుము ఇతర సామాగ్రిని దూళిభద్ర తీసుకెళ్లి అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆ సమయంలో నిర్మాణ ప్రదేశానికి ఒడిశా పోలీసులు, అధికారులు చేరుకొని వ్యాన్‌తో సహా నిర్మాణ సామగ్రిని కొఠియా పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌ను డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరిగినప్పటికీ ఆంధ్రా అధికారులు, పోలీసులు గానీ ఈ వ్యవహారంపై నోరుమెదపడం లేదు. కొటియా గ్రామాల్లో రహదారులు, పాఠశాల భవనాల నిర్మాణం, జలజీవన్ మిషన్ వంటి పనులు ఒడిశా ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను ఎపి అధికారులు, పోలీసులు ఏనాడూ అడ్డుకోలేదు. అయితే ఎపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను మాత్రం ఒడిశా పోలీసులు అధికారులు అడ్డుకుంటున్నారు. ఎపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకున్న ఒడిశా పోలీసులు, అధికారులు తరచూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే కొటియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల ఆగడాలు శృతిమించుతున్న తీరు ఎపి అధికారులు, పోలీసులను కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోతే తాము ముందుకు వెళ్లలేమనే నిస్సహాయతని ఎపి అధికారులు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
