షాక్‌ కొడుతున్న విద్యుత్తు బిల్లులు

Jan 7,2025 21:49

ప్రజాశక్తి – సీతంపేట:  విద్యుత్‌ వినియోగదారులకు గత రెండు నెలలుగా వస్తున్న బిల్లులు షాక్‌ల మీద షాక్‌లు కొడుతున్నాయి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ఛార్జీలు పెంచమన్న చంద్రబాబు తీరా అధికారానికి వచ్చిన ఆరునెలలుగా విద్యుత్‌ భారాలు మోత మేయిస్తూనే ఉన్నారు. విద్యుత్‌ఛార్జీలు పెంచమంటూ అధికారంలో వచ్చిన మీరు ఇలా బిల్లులు పెంచడం ఎంత వరకు సమంజమని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ నాయకులకు గత పాలకుల ఒప్పందాల వల్లేనని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా వినియోగదారులకు భారాలు తప్పడంలేదు.టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజీ కాస్ట్‌ అడ్జస్ట్మెంట్‌ (ఎఫ్‌పిపిపిసిఎ) పేరుతో విధించిన ఛార్జీలు ప్రజలకు భారంగా మారాయి. గత ప్రభుత్వం ట్రూ ఆప్‌, ఎఫ్‌పిపిపిసిఎ వంటి వివిధ రూపాల్లో విధించిన బిల్లుల భారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం నవంబర్‌ నుంచి ఎఫ్‌పిపిపిసిఎ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించడంతో ఆ భారానికి ఎఫ్‌పిపిపిసిఎ ఛార్జీలు తోడై వినియోగదారులపై మరింత భారం పడింది. వీటికి తోడు సర్‌ఛార్జీలు, ఫిక్స్‌డ్‌ కస్టమర్‌ ఛార్జీలు ఇలా రకరకాల పేర్లతో విధించిన ఛార్జీలతో వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. మండలంలోని కంబగూడకు చెందిన ఆరిక పద్మ రేకింట్లో నివాసముంటోంది. ఈమె ఫ్యాను, మూడు బల్బులు వినియోగిస్తోంది. ఈమె (సర్వీస్‌ నెంబర్‌ 131512 పి 4400040) 59 యూనిట్లు విద్యుత్‌ వినియోగించారు. ఇందుకు గానూ ఈనెల ఆమెకు రూ.1752 బిల్లు వచ్చింది. 59 యూనిట్లకు ఇంత బిల్లు రావడంతో ఆమె గుండె గుభేల్‌ మంది. ఈ బిల్లులో వినియోగించిన యూనిట్ల కంటే ఇతర చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఎఫ్‌పిపిపిసిఎ, కస్టమర్‌ చార్జీలు, సర్‌ఛార్జీలు, ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, ఎనర్జీల ఛార్జీ, ఇలా అన్ని ఛార్జీల పేరి రూ.1752 బిల్లు వచ్చింది. పద్మ ఎస్‌టి తెగకు చెందినవారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితం. అయినా పద్మకు ఇంత పెద్దమొత్తంలో బిల్లు వచ్చింది. ఉన్న ఇల్లు రేకిళ్లు మాత్రమే సాధారణంగా ఫ్యాను మూడు బల్బులు ఉన్నాయి. అలాగే సీతంపేటకు చెందిన బూసి గోవింద (విద్యుత్‌ సర్వీస్‌ నెంబర్‌ 13512 పి 384001168) గత నెల బిల్లు రూ.805 విద్యుత్‌ బిల్లు వచ్చింది. ఇంత శీతాకాలంలో ఫ్యాన్లు కూడా వినియోగించని తమకు ఇంత పెద్దమొత్తంలో బిల్లు రావడం పట్ల వినియోగదారుడు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వినియోగం తక్కువ సమయంలో ఇంత పెద్దమొత్తంలో బిల్లులు వస్తే రానున్న వేసవిలో వినియోగం పెరిగి ఇంకెంత పెద్దమొత్తంలో బిల్లులు వస్తాయోనని వినియోగ దారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివిధ ఛార్జీల పేరిట వేస్తున్న విద్యుత్‌భారాలను తగ్గించాలని కోరుతున్నారు. బిల్లును చూసి షాకయ్యా మాది చిన్న రేకు ఇల్లు. ఒక ఫ్యాను, మూడు బల్బులు, టీవీ మాత్రమే ఉన్నాయి. 59 యూనిట్లు వినియోగిస్తే రూ. 17 52 బిల్లు వచ్చింది. దీంతో బిల్లును చూసి షాకయ్యా. ఎస్‌టిల మైన తమకు 200 యూనిట్లు లోపు ఉచితం అయినప్పటికీ ఇంత మొత్తంలో బిల్లు రావడం కష్టంగా ఉంది. ఆరిక పద్మ ,కంబగూడవిద్యుత్‌ బిల్లులు తగ్గించాలి విద్యుత్‌ బిల్లు ఇటీవల కాలంలో ఎక్కువ వస్తున్నాయి. వాడింది తక్కువైన ప్పటికీ బిల్లు మాత్రం ఎక్కువ రావడంతో చెల్లించలేని పరిస్థితి దాపురించింది. ఇప్పటికే రూ.805 బిల్లు వచ్చింది.బూసి గోవింద, సీతంపేట.

➡️