పాఠశాలల మిళితంపై పునఃపరిశీలన చేయాలి

Feb 1,2025 20:53

పార్వతీపురం: ప్రభుత్వ పాఠశాలల మిళితంపై ఇప్పటికే తయారు చేసిన నివేదికను పునఃపరిశీలన చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. దీనివల్ల విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని, కావున దీనిపై విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో ప్రత్యేక కసరత్తు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల మిళితంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక అంతరాలు తొలగించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండేలా మిళితం చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల్లో డ్రాపౌట్స్‌ను పూర్తిగా అరికట్టడానికి ఈ నూతన విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి మంచి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, కావున విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో మిళితం చేయనున్న పాఠశాలలపై మరోమారు కసరత్తు చేయాలని, దీనివల్ల విద్యార్థులు లాభపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిళితం చేసే అంశాన్ని ముందుగా విద్యార్థుల తల్లితండ్రులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించి, అవగాహన కల్పించాలని, అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి నడుచుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల డ్రాపౌట్స్‌ను గుర్తించి కళాశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపర్చాయలని అన్నారు. విద్యార్థుల్లో సమానత్వంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోబిక, డిఇఒ డా. ఎన్‌.తిరుపతినాయుడు, ఎస్‌ఎస్‌ఎ ఆర్‌.తేజేశ్వరరావు, డిప్యూటీ డిఇఒలు డి.రాజ్‌ కుమార్‌, పి.కృష్ణమూర్తి నాయుడు, ఎంఇఒలు తదితరులు పాల్గొన్నారు.

➡️