ప్రజాశక్తి పార్వతీపురం రూరల్, టౌన్ : దేశంలోనే అణగారి వర్గాల అభ్యున్నతికి పార్లమెంట్లో గొంతెత్తి నినదించడమే కాకుండా, తన వాదనా పటిమతో ప్రత్యర్థి నాయకుల మెప్పును పొందగలిగే అనితర సాధ్యుడు, గొప్ప దార్శనికుడు సీతారాం ఏచూరి అని వక్తలు కొనియాడారు. సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి నివాళిగా జిల్లా కమిటీ ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు నివాళ్లు అర్పించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో పార్టీ మహాసభలు నిర్వహించుకునే తరుణంలో ఆయన మరణం ఎనలేని లోటన్నారు. ప్రపంచంలో అన్ని పార్టీలు గుర్తించిన మార్క్సిస్టు మేధావి ఏచూరి అని ఆమె అన్నారు. దేశ ప్రధాని సైతం వామపక్ష కాంతిరేఖగా ఆయన్ను అభివర్ణించడం, మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు ఏచూరి మార్గమే శరణ్యమని రాహుల్ గాంధీ కొనియాడడం, దేశం ఒక సిద్ధాంతకర్తను కోల్పోయినట్లు చంద్రబాబు ప్రకటించడం గమనిస్తే ఆయన వ్యక్తిగా అన్ని పార్టీల నాయకులు సైతం అభిమానించే వ్యక్తిత్వం కలిగిన వారిని అన్నారు. ఇందిరాగాంధీని సైతం ఎదిరించగల ధీరత్వం ఆయనదని అలాంటి నాయకుడ్ని కోల్పోవడం దురదృష్టకరమైనప్పటికీ ఆయన మార్గంలో నడిచి ఆశయాలను సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొల్లి గంగు నాయుడు, వి.ఇందిర, ఐద్వా నాయకులు రెడ్డి శ్రీదేవి, బొత్స లక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణారావు, మన్మధరావు, కోశాధికారి జి.వెంకటరమణ, పలువురు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఏచూరి వ్యూహాలు మరువలేనివిటిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు మాట్లాడుతూ 1984 టిడిపి సంక్షోభంలో ఉన్నప్పటి నుంచి సీతారాం ఏచూరిని తాము గమనిస్తూ ఉన్నామని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్టీయార్‌కు అండగా నిలబడి ఆయన సాగించిన పోరాటంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తలలు వంచేందుకు ఆయన చూపించిన చొరవ, వేసిన వ్యూహాలు టిడిపి పార్టీ ఎప్పుడు గుర్తు ఉంచుకుంటుందని అన్నారు. వామపక్ష ఐక్యత కాంక్షించే నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు మాట్లాడుతూ వామపక్ష ఐక్యతను బలంగా కాంక్షించే నాయకుడు సీతారాం ఏచూరి అని, దేశ కమ్యూనిస్టు చరిత్రలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న నాయకుడని, ఆయన లేని లోటు వామపక్ష ప్రజాతంత్ర పార్టీలకు తీర్చలేనిదని అన్నారు.లౌకికవాద బలోపేతాన్ని ఆకాంక్షించారుసిపిఐ ఎంఎల్ నాయకులు ఎం.భాస్కరరావు మాట్లాడుతూ మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించడానికి లౌకికవాదం బలపడడమే ఏకైక మార్గమని కాంక్షించిన వ్యక్తి ఏచూరి అని అన్నారు. ప్రస్తుతం శ్రీలంక వంటి దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ గెలవడం చూస్తుంటే భవిష్యత్తు కమ్యూనిస్టు పార్టీలదేనని ప్రజలు కాంక్షిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఏచూరి మరణం వామపక్ష పార్టీలకు తీవ్రమైన లోటని అన్నారు. ఏచూరి ఆశయాలు కొనసాగించాలిసిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పి.భాస్కరరావు మాట్లాడుతూ ఏచూరి ఆశయాలను కచ్చితంగా అన్ని పార్టీలు కొనసాగించడమే లక్ష్యం కావాలన్నారు. రాజ్యాంగాన్ని,, పార్లమెంటరీ విధానాన్ని అవపోసన పట్టిన గొప్ప మేధావి సీతారాం ఏచూరి దేశ పరిస్థితులతో పాటు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ విధానాన్ని అవపోసనపట్టిన గొప్ప మేధావి అని సిపిఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి కొనియాడారు. మూలాలు కాకినాడలో ఉన్నాయని, దక్షిణ భారతంలో పుట్టి, ఉత్తర భారత దేశంలో కూడా ఆయన రాజకీయ ప్రభావాన్ని చూపించారని అన్నారు. తనకు ప్రత్యక్ష పరిచయాలు ఆయనతో లేకపోయినా, పార్టీ కేంద్రనాయకుడిగా ఆయన రాజకీయ శైలిని అనుసరిస్తూ ఉన్నామని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని నడిపించడంలో ఎనలేని స్థితప్రజ్ఞత ప్రదర్శించారని, ఆయన రాజకీయ దురంధరుడుగా మారడానికి ఆయన కుటుంబం యావత్తూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నేపథ్యమేనని అన్నారు. చిన్ననాటి నుంచే వామపక్ష భావాలను అలవర్చుకున్నారన్నారు. ప్రత్యర్థులను సైతం అభిమానించే వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. నిరాడంబరులు ఏచూరివైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ విద్యార్థి దశలో తమకు సీతారాం ఏచూరి ఆదర్శ నాయకుడని, ఆయన ప్రసంగాలు విని ఉత్తేజితులమై ఆయన్ను ఆరాధించడం ప్రారంభించామని అన్నారు. ఢిల్లీలోని జెఎన్‌యులో తమ మిత్రులను కలవడానికి వెళ్ళినప్పుడల్లా ఆ ప్రాంగణంలో నిరాడంబరంగా ఉండే ఏచూరిని చూస్తూ ఉండేవారమని అంటూ ఆయనతో తన అనుబంధాన్ని తెలిపారు.