ప్రజాశక్తి – వీరఘట్టం : మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమస్య సుస్తీ చేసింది. ఈ పిహెచ్‌సిల్లో కనీస సౌకర్యాలు లేక రోగులకు అవస్థలు తప్పడం లేదు. మండలంలోని వీరఘట్టం, బిటివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 24 సచివాలయాల్లో సుమారు 66వేలమందికి పైచిలుక జనాభా వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ప్రాముఖ్యత గల ఈ వైద్యశాలల్లో జనాభా తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు, సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు పడకలకే పరిమితంవీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ఆరు పడకలను 30 పడకలుగా విస్తరించేందుకు అభివృద్ధి పనులు చేపడతామని గత టిడిపి ప్రభుత్వ పాలనలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు 2015-2017లో వీరఘట్టం పర్యటనలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ నేటికీ ఇక్కడ అభివద్ధి పనులు చేపట్టకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఆరు పడకలే ఉండడంతో రోగులతో నిండుకుంటే మిగిలిన వారికి సిమెంట్ పలకలపైన వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇరుగ్గా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సీతంపేట మండలంలోని పొల్ల, దోనుబాయి తదితర గిరిజన గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం పొందుతున్నారు. అలాగే విజయనగరం జిల్లా వంగర మండలం, గరుగుబిల్లి మండలం నుంచి కూడా రోగులు ఇక్కడికి వచ్చి వైద్యం పొందుతున్నారు. ప్రతిరోజు 200పైగా ఒపి రోగులు తాకిడితో ఆసుపత్రి కిటకిటలాడుతుంది. వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటల ఆసుపత్రి కావడంతో అత్యధికంగా డెలివరీలు జరుగుతున్నాయి. ఇక్కడ స్త్రీ వైద్య నిపుణులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను ప్రసవం కోసం పాలకొండ, పార్వతీపురం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బిటువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మారుమూల ఉండడంతో వీటి పరిధిలో గల గర్భిణీలు 108 సహాయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేధిస్తున్న సిబ్బంది కొరతఇదిలా ఉండగా వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోనే చలివేంద్రి, చిన్నగోర, చిదిమి, బిటివడ ఆరోగ్య కేంద్రం పరిధిలోని కత్తుల కవిటి సచివాలయాలకు ఎఎన్‌ఎంలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో గర్భిణీలకు, బాలింతలకు, ఐదు, పదేళ్లుదాటిన పిల్లలకు పక్కనున్న సచివాలయం ఎఎన్‌ఎంల ద్వారా వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఖాళీలను భర్తీ చేయాలని జిల్లా స్థాయి అధికారులకు నివేదికలు కూడా ఇచ్చామని వైద్య అధికారులు చెబుతున్నారు.పరాయి పంచన విధులుమండలంలోని వీరఘట్టం, బిటవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల నడుకూరు, నర్సిపురం, కంబర, కత్తుల కవిటి, హుస్సేన్ పురం, వండువ, తూడి సచివాలయాల్లో గల ఆరోగ్య ఉప కేంద్రాల పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో సిబ్బంది పరాయి పంచన విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా 104 ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు భవన సదుపాయం లేకపోవడంతో ఆరుబయట చెట్ల నీడలో రోగులకు వైద్య తనిఖీలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఈ విషయంపై ఎంపిపి మాజీ తాజా ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యమందించేలా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
