ప్రజాశక్తి – పాచిపెంట/సాలూరురూరల్ : జిల్లాలో గంజాయి, మద్యం అక్రమరవాణా నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డి ప్రొబేషనరీ ఎస్‌ఐలకు సూచించారు. బుధవారం ఆయన సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ ఎస్సైలకు నిర్వర్తించాల్సిన విధుల పట్ల దిశా నిర్దేశం చేశారు. తరుచూ గ్రామాలను సందర్శించాలని, ముఖ్యంగా ఏజెన్సీ (ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలను సందర్శించాలని, అక్కడ ప్రజలతో సమావేశమై, వారితో మమేకమై వారికీ సైబర్, నక్షలిజమ్/ మత్తుపదార్దాల/ నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌పి కూంబింగ్ ఆపరేషన్ల గురించి తెలుసుకొని, నిర్వహించాలని, చుట్టూ పక్కల ఏజెన్సీ (ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాల్లో సంచరించే దళాల గురించి, వారికి సహయం చేసేవారి వివరాలు, మునుపటిగా జరిగిన సంఘటనలు గూర్చి తెలుసుకోవాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సామరస్యంగా మెలగి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. నాఖబంది విధులు ఇతర స్టేషన్ విధుల గురించి క్షుణ్ణంగా ఈ ప్రాక్టికల్ శిక్షణలో నేర్చుకోవాలని తెలిపారు. అనంతరం పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో గల హైవే దగ్గర చిన్న చిన్న రహదారులు మాతుమూరు, అలూరు గ్రామాల రహదారుల గుండా ఒరిస్సా నుండి, ఇతర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్రమరవాణా (గంజాయి,మద్యం) నియంత్రించేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ఈ సందర్శనలో సాలూరు పట్టణ, రూరల్ సిఐలు బి.అప్పలనాయుడు, రామకృష్ణ, రూరల్ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్, ప్రొబేషనరీ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
