ప్రజాశక్తి,-పార్వతీపురం : మన్యం జిల్లాలో మలేరియా కేసుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు చెప్పారు. వేసవిలో ప్రజలు వడదెబ్బలకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్యసిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో వైద్యపరంగా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ‘ప్రజాశక్తి’తో ముఖాముఖి మాట్లాడారు.
– జిల్లాలో మలేరియా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
మన్యం జిల్లాలో మలేరియా నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాం. జూన్ నుంచి డిసెంబర్ వరకు మలేరియా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దోమల నివారణకు మే నెల 1 నుంచి స్ప్రేయింగ్ మొదలు పెట్టనున్నాం. జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే 800 గ్రామాలను గుర్తించాం. నాలుగు లక్షల దోమ తెరల కోసం ప్రతిపాదనలు పంపించాం. మూడు రౌండ్ల పిచికారీ చేయాలని నిర్ణయించాం. యాంటీ లార్వా ఆపరేషన్ మలేరియా నియంత్రణకు చర్యలు చేపడతాం.
గత ఏడాది ఎన్ని మలేరియా కేసులు నమోదయ్యాయి?
గిరిజన ప్రాంతాల్లో నియంత్రణ కు ఎలాంటి చర్యలు చేపడతారు?గత ఏడాది లో సుమారు 2వేల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంతవరకు 640 కేసులు నమోదయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, వసతిగృహాల్లో పిచికారీ చేపడతాం. ఈనెల 24 నుంచి వేసవి సెలవులు కావడంతో పాఠశాలలు, వసతిగృహాల్లో పిచికారీ చేస్తాం. కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేయిస్తాం.
వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వడగాల్పులపై అవగాహనకు ఎలాంటి చర్యలు చేపడతారు?
వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున వడగాల్పుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వడగాల్పులకు గురయ్యే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు బెడ్‌లను కేటాయించాం. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా వుంచాం. ఉపాధి హామీ పథకం కింద పనులు ఉదయం పది లోగా పూర్తి చేయాలని సూచించాం. జిల్లాలో ప్రస్తుతం రెండు లక్షల ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో ఏడు లక్షల ప్యాకెట్లకు ప్రతిపాదనలు పంపించాం. స్వచ్చంధ సంస్థలతో మాట్లాడి ప్రధాన కూడళ్లలో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లాలో ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు ఉన్నాయి?
జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ పిహెచ్ సిలు, 282 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి కొత్త భవనాలు నిర్మాణమయ్యాయి. కొన్ని చోట్ల అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. జిల్లాలో 8 చోట్ల బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం హయాంలో చర్యలు చేపట్టారు. రూ.50లక్షలతో ఒక్కో యూనిట్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ పర్యవేక్షణలో వీటి నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.
పిహెచ్‌సిల్లో మందుల నిల్వకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వకు త్రీ ఫేజ్ కరెంట్ అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించాం. టూ ఫేజ్ కరెంట్ వల్ల కొన్ని మందులు పాడయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో గురివినాయుడు పేట, నీలకంఠాపురం పిహెచ్‌సిల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పిహెచ్‌సిలకు త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా కోసం రూ.1.24 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం.
జిల్లాలో ఎన్ని అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి?
జిల్లాలో 108 వాహనాలు 17 వున్నాయి. ఇవేకాక కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద జిల్లాకు కేటాయించిన ఐదు అంబులెన్సు లను తాటికొండ, దుడ్డుకల్లు, నీలకంఠాపురం, తోణాం, రేగిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించాం.
