ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

Oct 1,2024 21:57

ప్రజాశక్తి – పార్వతీపురం : విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ బిజెపి కుయుక్తులకు పాల్పడుతుంటే టిడిపి, జనసేన, వైసిపి కపట నాటకాలు ఆడుతున్నాయని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి విమర్శించారు. విద్యార్ధి, యువజన సంఘాల ఆధ్వర్యాన విశాఖ ఉక్కు పరిరక్షణకై చేపట్టిన దీక్షలనుద్దేశించి మంగళవారం కృష్ణమూర్తి మాట్లాడారు. స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ఆఫీస్‌ ఎదుట రిలే దీక్ష చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.రాజు అధ్యక్షతన జరిగిన దీక్ష శిబిరానికి సిఐటియు, ఎఐటియుసి, అఖిల భారత గ్రామీణ కార్మిక సంఘాల నాయకులు వై. మన్మధరావు, కె.జీవ, సూరయ్య, సిపిఎం, సిపిఐ పార్టీల జిల్లా కార్యదర్శులు రెడ్డి వేణు, కె.మన్మధరావు సంఘీభావం తెలిపారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తికి ఇనుప ఖనిజంతో పాటు బొగ్గు కావాలని, స్టీలు ప్లాంటుకు బొగ్గు సరఫరా కాకుండా కుట్రలు చేసింది బిజెపి, దాని మిత్రపక్ష పార్టీలేనని అన్నారు. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల్లో రెండు మూత పడిపోయాయని, స్టీలు ప్లాంటులో పని చేస్తున్న 4వేల మంది కార్మికులను పని నుంచి నిలిపేసిందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ను కార్పొరేట్‌ మిత్రులకు అమ్మేస్తాం, లేకుంటే ప్లాంటును పూర్తిగా చంపేస్తామని మోదీ ప్రభుత్వం శపథం చేసిందని, ఇప్పుడు అదే పని చేస్తున్నదని అన్నారు. స్టీలు ప్లాంటు నేరుగా 36 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని, అందులో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు జరిపి 1500 మంది ఎస్టీ, 4వేల మంది ఎస్సీలకు ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. అంతే కాకుండా స్టీలు ప్లాంటు అనుబంధ పరిశ్రమల్లో మరో 50 వేల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉద్యోగ, ఆర్థిక భరోసాగా నిలిచిందని, స్టీలు ప్లాంటును నాశనం చేస్తే నేటి విద్యార్దుల భవిష్యత్తు శూన్యమే అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌ సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం 1325 రోజులుగా పోరాటం జరుగుతుందని, ఆంధ్రుల ఆత్మగౌరానికి ప్రతీకగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పట్ల కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం వైఖరిలో ఏమాత్రం మార్పులేదన్నారు. కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, మంత్రులు మాట్లాడుతున్న తీరు, రాజకీయ నాయకుల ప్రకటనలు చూస్తుంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పెద్ద కుట్ర జరుగుతున్నట్లు కనపడుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన కుదరడం లేదని విమర్శించారు. బిజెపితో కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తిరుపతి లడ్డు కల్తీ నాటకానికి తెరతీశారని, కల్తీ జరిగితే కల్తీ చేసిన వారిని శిక్షించే అధికారం ఉన్నా ఆ పని చేయడం లేదని, చేయాల్సిన పని చేయకపోగా మతోన్మాదాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని బిజెపి ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ బి.రవికుమార్‌, డివైఎఫ్‌ఐ నాయకులు ఎం.వెంకటరమణ, ఎఐవైఎఫ్‌ నాయకులు బిటి నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిహెచ్‌ సింహాచలం, కె.డేవిడ్‌, సురేష్‌, శివ, శ్రీను, వెంకట్‌ మరియు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️