పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు

Jan 11,2025 21:06

పార్వతీపురంరూరల్‌ : శంబర పోలమాంబ జాతరకు పోలీసులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకునేలా పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఎస్‌పి ఎస్‌ వి మాధవ్‌ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మక్కువ మండలం శంబరలో శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈనెల 27,28,29న అంగరంగ వైబవంగా జరగబోయే సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిమిత్తం పోలీస్‌ అధికారులతో జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిర్వహించాల్సిన విధి నిర్వహణ, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై దిశా నిర్దేశం చేశారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర, గిరిజన జాతర పండగను తిలకించేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రజలు, భక్తులు గ్రామానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా వారి రాకపోకలకు, భద్రతకు ఎటువంటి అవాంతరం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయల ప్రాంగణం, క్యులైన్‌లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికుల వ్యక్తిగత భద్రతకు గట్టి భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక క్రైం బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు సూచనలు చేసేందుకు అన్ని ముఖ్య కూడళ్లలో పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనాల పార్కింగ్‌, దారి మళ్లింపు ఉన్న ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ఎంట్రీ, ఎగ్జిట్‌ గేటుల వద్ద భక్తులకు సమాచారం పూర్తిగా తెలిసేలా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిమాను తిరిగే మార్గంలో ఎక్కువ మంది ప్రజలు రాకుండా చూసేందుకు ఏరియా క్లియరెన్సు పార్టీలను, రోప్‌ పార్టీలను ఏర్పాటు చేయాలని, సిరిమాను తిరిగే ప్రదేశాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయ శాఖ ప్రోటోకాల్‌ సిబ్బంది, మున్సిపల్‌ తదితర సంబంధిత శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి అంకిత సురాన, సాలూరు పట్టణ, రూరల్‌ సిఐలు అప్పలనాయుడు, రామకృష్ణ, సాలూరు రూరల్‌, పాచిపెంట, మక్కువ ఎస్‌ఐలు నరసింహమూర్తి, వెంకట సురేష్‌, వెంకట రమణ పాల్గొన్నారు.

➡️