అటవీ విస్తరణ పెంపునకు పటిష్ట చర్యలు

Jan 16,2025 20:33

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచి పచ్చదనం విస్తరించేందుకు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాలతో సంబంధం ఉన్న గిరిశిఖర ప్రాంతాల్లో రహదారుల విస్తర్ణకు అటవీ శాఖ తమ నిబంధనలను సరళతరణం చేసింది. దీనివల్ల, రహదారుల అభివృద్ధి పనులకు కొంతవరకు అడవుల విస్తీర్ణం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రతిగా రెవెన్యూతో పాటు ఇతర శాఖల నుంచి దఖలుపడిన భూముల్లో అడవులను విస్తరించి పర్యావరణం పెంపు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో పార్వతీపురంలో 26,301.07 హెక్టార్లు, పాలకొండలో 20,507.74, సాలూరులో 28,230.91, కురుపాంలో 32,681.66 హెక్టార్లు కలిపి మొత్తం 1,07,721,38 హెక్టార్లలో అడవులున్నాయి. ఈ ఏడాది పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల పరిధిలో అటవీ విస్తీర్ణం మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారి జిఎపి ప్రసూన మాట్లాడుతూ అటవీ విస్తీర్ణం పెంపే లక్ష్యంగా జిల్లాలో పలు మండలాల్లో 18 నర్సరీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిలో 16.16 లక్షల మొక్కలు పెంచుతున్నామని, అందుకుగాను అటవీ సెక్షను, బీట్‌ అధికారులకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రహదారులు, గ్రానైట్‌ అనుమతులు తదితర అవసరాలకు అటవీ భూమి మంజూరు చేస్తున్నామని. దీనికి సమానంగా మరో చోట భూమి తీసుకుంటున్నటు తెలిపారు. ఈ విధంగా వివిధ పథకాల నుంచి 312 హెక్టార్లలో 245 స్థలాలు లభించాయని ఆయా ప్రాంతాల్లో మొక్కలు బాధ్యతగా నాటుతున్నామన్నారు. జిల్లాలో టేకు, గుగ్గిలం, నీలగిరి లాంటి విలువైన వనాల పెంపకంపై దృష్టి పెట్టాం. 2024 ముగింపు నాటికి 452.15 హెక్టార్లలో టేకు, 99.02 హెక్టార్లలో గుగ్గిలం, 22.15 హెక్టార్లలో నీలగిరి పెంచుతున్నామని తెలిపారు. జిల్లాలో ప్రవేశించిన ఏనుగుల గుంపులు కలిగిస్తున్న నష్టాలకు పరిహారం వెంటనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఏనుగులను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తెప్పిస్తున్నామని, వాటిని నియంత్రించేందుకు, సెక్షన్‌ అధికారితో పాటు ఇద్దరు గార్డులకు శిక్షణ ఇప్పిస్తన్నట్టు తెలిపారు. ఇందుకుగానూ సీతానగరం మండలం జోగింపేట అడవుల్లో కుంకీల స్థావరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. భామిని, కురుపాం ప్రాంతాల్లో తిరుగుతున్న 11 ఏనుగుల పర్యవేక్షణను ప్రత్యేక రేంజ్‌ అధికారి, 38 మంది ట్రాకర్లతో పాటు సెక్షను, బీట్‌ సిబ్బంది చూస్తున్నారని, కరిరాజుల బారిన పడి పాడైన పంటలకు సంబంధించి రూ.45 లక్షలు చెల్లించడానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.

➡️