జీడి పప్పు ప్రాసెసింగ్‌ యూనిట్లకు తోడ్పాటు

Jan 7,2025 21:47

ప్రజాశక్తి – పార్వతీపురం : ఐటిడిఎ పరిధిలోని జీడిపపవి ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ఉద్యాన రైతులకు తోడ్పాటు అందివ్వాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడిపప్పు మార్కెటింగ్‌లో రైతులు దళారుల బారిపడకుండా విడివికెల ద్వారా మంచి ధర కల్పించేలా వ్యవసాయ, ఉద్యాన వన అధికారులు ప్రోత్సాహాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఏఏ గ్రామాల్లో ఎంత మేరకు లెమన్‌గ్రాస్‌ సాగుచేస్తున్నది, విస్తీర్ణం అంశాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో లెమన్‌ గ్రాస్‌ పెంపకం విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా లెమన్‌ గ్రాస్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే అవకాశాలను కల్పించవచ్చని అన్నారు. జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో లెమన్‌ గ్రాస్‌ సాగు చేస్తున్నట్లు అధికారులు తెలపగా శ్రీనిధి, బీసీ కార్పొరేషన్‌ ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేసి జిల్లా లో వేయి ఎకరాల్లో సాగు లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అవకాశాలను కూడా తెలపాలన్నారు. లెమన్‌ సాగు ఈ క్రాప్‌ కింద ఆన్లైన్‌ లో నమోదు చేయాలని, నమోదైన పంట వివరాలను క్షేత్రస్థాయిలో ఆన్లైన్‌ లో వివరాలు, విస్తీర్ణ సాగు ఖచ్చితంగా ఉండేలా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పునః పరిశీలన చేయాలన్నారు. భామినిలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఎడి మార్కెటింగ్‌ అధికారులను ఆదేశించారు. ఐటిడిఎ పరిధిలోని గదబ, సవర గిరిజన కులాల లభిదారులకు గొర్రెలు, మేకలు యూనిట్ల కొనుకోలుకు రుణాలు మంజూరు చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. నీతి ఆయోగ్‌ ఆశావహ జిల్లాగా ఉన్నందున అన్ని రంగాల్లో అభివద్ధి పనుల సూచికల లక్ష్యాల సాధనకు పురోగతి స్పష్టంగా చూపాలన్నారు. మిల్లెట్‌ మేళాలను నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.హేమలత, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా అటవీ శాఖ అధికారి జిఎపి ప్రసూన, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కె.రాబర్ట్‌పాల్‌, డ్వామా, డిఆర్‌డిఎ పీడీలు కె.రామచంద్రరావు, వై.సత్యం నాయుడు, జిల్లా పశుసంవర్ధకశాఖ డాక్టర్‌ ఎస్‌.మన్మధ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, ఐటిడిఎ ఎపిఒ మురళీ, తదితరులు, పాల్గొన్నారు.వడ్డీలేని పంట రుణాలపై అవగాహన కల్పించాలి వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు రైతులకు లక్షలోపు వడ్డీలేని పంట రుణాలు అందించనున్నందున పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంక్‌ అధికారులు, పలు శాఖల అధికారులతో డిసిసి, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌ 2024- 25 సంవత్సరానికి రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ 2023కు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించిన రైతుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ ఎంటర్ప్రైజెస్‌ పథకం కింద యువత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ఊతమివ్వాలని అన్నారు. ప్రధాన మంత్రి స్వానీధి, మత్స్యకారుల వీధి వ్యాపారులకు రుణాలు, ముద్రా రుణాలు మంజూరులో కొన్ని బ్యాంక్‌లు వెనుకబడి ఉన్నందున త్వరితగతిన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంప్లాయిమెంట్‌ డెవలప్మెంట్‌పై యువతకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాంక్‌ ఖాతాదారుల సౌలభ్యం కోసం మొండెంఖల్‌ వద్ద కొత్త బ్రాంచ్‌ ఏర్పాటుకు అధికారులు, ఆలోచనలు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో అందించడం, లక్ష్యాలను అధిగమించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంక్‌ అధికారులను ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎన్‌.విజరుస్వరూప్‌, డిసిసిబి బ్యాంక్‌ సిఇఒ సిహెచ్‌.ఉమామహేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి పి.శ్రీరామ్మూర్తి, జిల్లా మత్స్య శాఖ అధికారి తిరుపతయ్య, ఎఎల్‌డిఎం కె.మౌనిక, ఇతర బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️