కురుపాం : ఫిబ్రవరి తొలినాళ్లలోనే సూరీడు సుర్రుమంటున్నాడు. సహజంగా శివరాత్రికి చలి ‘శివశివ’ అంటూ పోయి, వేసవి ప్రారంభమయ్యేది. అయితే గడిచిన నాలుగైదు ఏళ్లుగా వాతావరణంలో సంభవించిన పెనుమార్పుల వల్ల ఫిబ్రవరి చివరిలోనే ఎండలు మండుతూ వస్తున్నాయి. ఈ ఏడాది భానుడి ప్రతాపం ఎక్కువేనని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తగ్గట్టే ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు మండుతున్నాయి. మన్యం జిల్లాలో పగటిపూట 30-36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ ఎసిలు ‘ఆన్’ అయ్యాయి. ఈ ఏడాది వేసవి ముందే వచ్చేసింది. ఫిబ్రవరి రెండో వారంలోనే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. గతంలో మార్చి 15 నుంచి ఎండాకాలం మొదలయ్యేది. విద్యార్థులకు ఒంటి పూట బడులు అప్పుడే మొదలయ్యేవి. ఈసారి వాతావరణంతో ఫిబ్రవరిలో ఏమాత్రం పగటిపూట చల్లగా ఉండడం లేదు.మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 40-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా మొదలు కావడంతో మార్చి, ఏప్రిల్, మేలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది మన్యం జిల్లాలో మేలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలున్నాయి. ఈసారి ఏప్రిల్, మేలో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంత వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన్యంలో అడవుల విస్తీర్ణంలో తగ్గుతూ ఏటేటా పచ్చదనం తగ్గిపోతూ ఉండడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వేడి గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదిఏమైనా ప్రకృతి సమతుల్యత పాటించకపోవడం వల్ల జీడిమామిడి పోక తప్పదు. తాగునీటి సమస్యా తలెత్తే ప్రమాదం ఉంది.
