ప్రజాశక్తి-కొమరాడ : సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేయకపోతే సరెండర్ చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హెచ్చరించారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పనితీరు, ప్రగతి నివేదికలు వివరించాలని ఎంపిడిఒ మల్లికార్జునరావు అధికారులకు సూచించారు. హౌసింగ్ శాఖలో బిల్లుల చెల్లింపులు, కొత్త ఇళ్ల గురించి ఎఇ రాము వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు స్పందిస్తూ మండలంలో 2016-19 కాలంలో మంజూరై మధ్యలో బిల్లులు నిలిచిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆ ఇళ్లకు బిల్లులు పెట్టేందుకు నిర్లక్ష్యం వహించడంతో బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ బిల్లులు పెట్టకుండా లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టిన పరశురాంపురం ఇంజినీరింగ్ అసిస్టెంట్ వి.సాయిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెబుతున్నా, కనీసం వారి మాటలను వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాధానం చెప్పడంపై ఎంపిడిఒ మరింత ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనకు సభలోనే షోకాజ్ జారీ చేశారు. వివిధ పనులు చేయని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకూ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపిడిఒ తెలిపారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై ఎమ్మెల్యే సమీక్షించారు. గతంలో ఉన్న వైసిపి ఎంపిటిసిలకు అభివృద్ధి పనుల కోసం ఎంపిడిఒ నిధులు కేటాయిస్తున్నారు తప్ప అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా టిడిపి ఎంపిటిసిలకు నిధులు ఇవ్వడం లేదని విక్రంపురం ఎంపిటిసి డి.వెంకట్‌నాయుడు, గంగరేగువలస ఎంపిటిసి వెంకట నాయుడు, గుణానపురం ఎంపిటిసి సంతోషి.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్లో టిడిపి ఎంపిటిసిలకు గతంలో, కొత్తగా మంజూరు చేయాల్సిన నిధులు కేటాయించి, అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎంపిడిఒను ఆదేశించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
