లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు అందజేయాలి

Mar 12,2025 21:23

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణమైన టిడ్కో ఇళ్లను లబ్దిదారులందరికీ వెంటనే అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలపై చైతన్యయాత్రలో భాగంగా టిడ్కో గహ సముదాయాలను సిపిఎం బందం బుధవారం పరిశీలించింది. సాలూరు పట్టణంలో ఇళ్లు లేని పేదలందరికీ టిడ్కో ద్వారా 1248 ఇళ్లను ప్రభుత్వం నిర్మించినా ఈరోజు వరకు లబ్ధిదారులకు అందించకపోవడం దారుణమని అన్నారు. పేదల సమస్యలపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. 1248 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించి వీటిలో 1056 ఇళ్ల పనులు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పారు. ఈ గృహాల సముదాయంలో పిచ్చిమొక్కలు వెలసి తుప్పలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తలుపులు, కిటికీలకు చెదలు పట్టి పాడైపోయే అవకాశం ఎక్కువ ఉందని, కరెంటు, రోడ్లు, మంచినీటి సౌకర్యం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు ఇళ్ల స్థలాల్లేని వారి కోసం గుమ్మడ, నెలపర్తి ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలకు కూడా మౌలిక వస్తువులైన కరెంటు, నీరు, రోడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తుందని, ఇదే పరిస్థితి కొనసాగితే లబ్ధిదారులందర్నీ కలుపుకొని ఆందోళనకు సిద్ధపడతామని అన్నారు. దీనికి అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్ని కాలనీలో కూడా మౌలిక వస్తువులు పెంచేందుకు సరిపడా నిధులు కేటాయించి రోడ్లు కరెంటు నీరు పార్కులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సాలూరు పట్టణ సిపిఎం కార్యదర్శి ఎన్‌వై నాయుడు, నాయకులు ఈశ్వరరావు, తనూజు, భాస్కరరావు, పాచిపెంటర్‌ సిపిఎం నాయకులు కె.ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️