ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్: మాజీ ముఖ్యమంత్రి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబంపై టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డికి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి వినతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనా వైఫల్యాలను, సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడంతో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసిపి సోషల్ మీడియా సభ్యులపై, మద్దతుదారులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. స్టేషన్లలో పెట్టడం, కిడ్నాపులు చేయడం, వేధించడం ఇలా పలు విధాలుగా హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన వారందరిపైనా కూటమి ప్రభుత్వం దాడులకు దిగుతోందని, రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగడం లేదని చెప్పారు. రెడ్ బుక్ పాలన, మానసిక వికలాంగ పాలన కొనసాగుతుందని, ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. చాలా ప్రశాంతంగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించే సంప్రదాయాలున్న జిల్లాలో రాజకీయంగా, సిద్ధాంత పరంగా విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా దూషణలకు వెళ్లడం, హేళనలు చేయడం ఎప్పుడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితిని చూస్తున్నామని చెప్పారు. ఈ రకమైన సంప్రదాయానికి స్వస్తి పలకాలని మంత్రికి సూచించారు. ఏ ఒక్క సోషల్ మీడియా కార్యకర్తపై అక్రమ కేసులు బనాయించినా, వేధించినా… వారిపై పోరాడటానికి వైసిపి నాయకత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. చట్టానికి లోబడి పోలీస్ యంత్రాంగం నడుచుకొని, జిల్లాలో శాంతిభద్రతలు సాఫీగా ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి మామిడి బాబ్జీ, వైస్ ఎంపిపి బి.రవికుమార్, వైసిపి నాయకులు మంత్రి రవికుమార్, మండల అధ్యక్షులు బొమ్మి రమేష్, బలగ శ్రీరాములు నాయుడు, బలగ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.