ప్రజాశక్తి – పార్వతీపురం : డీఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు చేస్తున్న దీక్షలకు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని కోరారు. గురుకుల నిబంధనల ప్రకారం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను సిఆర్టీలుగా మార్చాలని డిమాండ్ చేశారు.,2024 మెగా డీఎస్సీ నుంచి గురుకుల ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు ఉంటుందని, ఏ ఉద్యమానికి పిలుపునిచ్చిన పూర్తిగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.లక్ష్మణరావు, కోలక అవినాష్, గౌరవ అధ్యక్షులు ఎస్ అప్పారావు కోశాధికారి కె.రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పి.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని అన్నారు. ఆయన వెంట పిఆర్‌టియు రాష్ట్ర నాయకులు అమరాపు సూర్యనారాయణ ఉన్నారు.అంబేద్కర్ విగ్రహానికి వినతిఏడో రోజు దీక్షల్లో భాగంగా రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, డీఎస్సీ నుండి పోస్టులు మినహాయించాలని, సమాన పనికి సమాన, కనీస వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు దివాకర్, రమేష్, రాజేష్, వెంకట్, జగదీష్, జ్యోతి, లక్ష్మి, కవిత, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.