ప్రజాశక్తి – పాలకొండ : స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తను తొలిగించాలని పట్టణ పౌరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావుకు, ఆందోళనకారులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కార్యాలయం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డగించగా కమిషనర్‌ను ఆందోళనకారులు నిలదీశారు. సమస్య పరిష్కారించ కుండా అడ్డుకోవడమేంటని కమిషనర్‌ను ప్రశ్నించారు. అనంతరం కార్యాలయం లోపలికి చేరుకుని రెండో ద్వారం ముందు భైఠాయించారు. 13,15,16 వార్డు కౌన్సిలర్లు బాసూరు కాంతారావు, తుమ్మగుంట శంకరరావు, కడగల రమణ మద్దతు తెలిపి బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం.తిరుపతిరావు, పట్టణ పౌరుల సంక్షేమ సంఘం కన్వీనర్ దావాల రమణా రావు తదితరులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అంటూ ప్రశ్నించారు. మూడు వార్డుల ప్రజలతో పాటు వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోక పోవడానికి కారణమేమటని ప్రశ్నించారు. ఈనెల 2న ధర్నా చేస్తే, వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పరిష్కారించలేదని అన్నారు. ఇక్కడ చెత్త వేయడం వల్ల పలువురు జ్వరంతో బాధపడుతున్నారని, ఇదేనా ప్రజా ఆరోగ్యమంటూ నిలదీశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో స్థలాలు గుర్తించామని, అయితే వివాదాలు రావడంతో నిలిచిపోతున్నాయని, దీనిపై దృష్టి పెడతామని చెప్పగా, నాయకులు అడ్డుతగిలారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, కౌన్సిల్ సమావేశంలో చర్చించి దీనిపై తీర్మానం చేయాలని పట్టుపట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, టిడిపి సీనియర్ నేత పల్లా కొండలరావు, చైర్ పర్సన్ యందవ రాధా కుమారి, టిడిపి పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్ నాయకులతో మాట్లాడారు. అయితే ఆందోళనకారులు నగర పంచాయతీ అధికారులు, పాలకవర్గం తీరుపై తప్పు పట్టారు. పట్టణానికి దూరంగా వేయకుండా జనావాసం మధ్య చెత్త వేయడమేమిటని నిలదీశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టిడి పారాపురం దగ్గర కేటాయించిన స్థలం అనువైందని, కోర్టు క్లియరెన్స్ పొంది అక్కడ ఏర్పాటు చేసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొండలరావుతో పాటు సంతోష్ రేపటి నుంచే చెత్తను విశాఖలో జిందాల్ కంపెనీకి పంపిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇప్పిస్తామని చెప్పారు. దీనిపై దావాల రమణారావు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో చర్చించి తీర్మానం చేయాలన్నారు. చెత్త వెంటనే తరలించి శాశ్వత పరిష్కారానికి తీర్మానించాలన్నారు. దీనికి కొండలరావు హామీ ఇచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం.తిరుపతి రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డు పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలో ఉండాలనే నిబంధన ఉందని, అయితే చెత్త వేసినప్పుడు ముందే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాలన్నారు.