పొత్తు పొడవని మొక్కజొన్న

Sep 28,2024 21:25

ప్రజాశక్తి – మక్కువ : మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉంటుందనుకొని సాగుకు ఉపక్రమించిన గిరిజన రైతులకు వారు వేసే విత్తనాలు పొత్తు పొడవకపోవడంతో మోసపోయామంటూ గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా మొక్కలే తప్ప ఒక్క పొత్తు కూడా మొలవకపోవడంతో గిరిజన రైతుల రోదన మిన్నంటుంది. వివరాల్లోనికి వెళ్తే…మండలంలోని నంద గిరిజన గ్రామానికి చెందిన పలువురు రైతులు అడ్వెంట రకానికి చెందిన మొక్కజొన్నను సాగు చేశారు. అయితే పంట చివరి దశకు చేరుకున్నప్పటికీ ఒక్క పొత్తు కూడా పొడవకపోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ పంట చేతికి రాని విత్తనాన్ని సాగు చేశామని లబోదిబోమంటున్నారు. మండల కేంద్రంలోని ఎరువుల పురుగుమందుల విక్రయించే దుకాణాల్లో ఎప్పటిలాగే ఈ ఏడాదీ కొనుగోలు చేశామని రైతు మెల్లిక సొన్న, సూడిపల్లి వెంకన్న, తాడంగి సీతయ్య, రాజు, తదితర రైతులు చెబుతున్నారు. ఎప్పటి మాదిరిగానే మొక్కజొన్నకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు కూడా అవసరం మేరకు వాడడం జరిగిందని వారు తెలిపారు. అయితే పంట చివర దశకు చేరుకున్నప్పటికీ ఒక్క మొక్కజొన్న పొత్తు కూడా రాలేదని, చేనంతా ఎర్రబారిన గడ్డి మాదిరిగా తయారయ్యిందని ఆవేదన చెందుతున్నారు. సుమారు 20 ఎకరాల్లో పంట పూర్తిగా చేతికి రాకుండా పోయిందని గిరిజనులు కలత చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమను మోసగించిన విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకుని తమకు పంట నష్టపరిహారం అందించాలని గిరిజనులు కోరుతున్నారు

➡️