పేదల స్థలం పెత్తందార్లకు.. రెవెన్యూ అధికారుల తీరు హేయం

Oct 29,2024 22:14

ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని పేదల ఇంటి స్థలాలకు రక్షణ లేకుండా పోయిందని, స్వయాన రెవెన్యూ అధికారులు పెద్దలకు అప్పగించాలని చూడడం హేయమైన చర్య అని ఆదివాసీ గిరిజన సంఘం తప్పు పట్టింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం నాయకులు తాడంకి ప్రభాకర్‌ సారాయివలసలో ఆవాల అప్పలస్వామి ఇంటిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో పొజిషన్‌లో ఉన్న వృద్ధుల ఇంటి స్థలాన్ని పెత్తందారైన అల్లు అన్నపూర్ణమ్మకు అనధికారికంగా అప్పజెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. 30ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూమి కొనుగోలు చేశారని, ఆ భూమిలో ఆవాల అప్పలస్వామి పూరిల్లు కట్టుకొని జీవిస్తున్నారని అన్నారు. 1996లో పొజిషన్‌ సర్టిఫికేట్‌ కూడా ఇచ్చారని, ఈ స్థలం వారి అనుభవంలో వుందని పేర్కొన్నారు. ఇదే స్థలాన్ని పెత్తందారైన అన్నపూర్ణమ్మకు అప్పచెప్పడానికి తహశీల్దార్‌ పోలీసులతో అప్పలస్వామి కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. అన్నపూర్ణమ్మ ఇప్పటికే 3సెంట్లు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని, అంతకుముందు ఆమె కుటుంబానికి గ్రామంలో పెంకుటిల్లు ఉందని అటువంటి వారికి మళ్లీ ఇంటి స్థలం అప్పజెప్పడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అప్పలస్వామి స్థలం ఆయనకే ఉండేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

➡️