‘ఉపాధి’ కోసం యుద్ధం

Oct 28,2024 21:24

పార్వతీపురం:  ఉపాధి హామీ చట్టం -2005లోని మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని కోరుతూ ప్రతిపక్ష వైసిపికి చెందిన పంచాయతీ సర్పంచులు పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 450 గ్రామపంచాయతీల్లో సుమారు 80శాతం పంచాయతీలు వైసిపికి చెందినవే కావడంతో ఆయా సర్పంచులు చట్టానికి లోబడి పనులు జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పంచాయతీల్లో పనులు గుర్తించడానికి సర్పంచుల ఆధ్వర్యాన గ్రామ సభలు నిర్వహించారు. పంచాయితీల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి వాటిని గ్రామసభల ఆమోదం పొందేలా చేశారు. మెజారిటీ పంచాయతీలు వైసిపి అధీనంలో ఉండడంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం ఉపాధిహామీ పనులు వారికి నచ్చిన వ్యక్తితో చేయించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉపాధి హామీ చట్టంలో సర్పంచ్‌ ఆధ్వర్యాన గ్రామ సభలే సుప్రీం అని పేర్కొనబడి ఉన్నా చట్టానికి విరుద్ధంగా టిడిపి నాయకులు, కార్యకర్తల ద్వారా చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం వెండర్‌ ఐడి సృష్టించి వారికి నచ్చిన కాంట్రాక్టర్‌ చేతనో, నాయకుల చేతనో పనులు చేయించాలని వ్యూహరచన చేస్తోంది. దీని కోసం తమ అధీనంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని వినియోగించాలని చూస్తోంది. అధికారపార్టీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఆ పనులు చేయడానికి రంగం చేస్తున్నారు. పంచాయితీ పరిధిలో పనుల గుర్తింపు నుంచి వాటిని చేపట్టే వరకు సర్పంచ్‌లే కీలకపాత్ర పోషించాలని చట్టం చెపుతున్నా దాన్ని నీరుగార్చే పనిలో అధికార ఉంది. వీరి సిఫార్సులకు అనివార్యంగా తలొగ్గాల్సిన పరిస్థితి అధికారులకు వుంది. అయితే వైసిపికి చెందిన సర్పంచులు గ్రామపంచాయతీల సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు న్యాయ పోరాటానికి సిధ్ధం కావాలని భావిస్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పుడు టిడిపి కూటమి ఎమ్మెల్యేలు, మంత్రి వున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో స్థానిక సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఎంపిపిలు మాత్రం వైసిపితోనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండల, జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఇరకాటంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా అధికారులకు నోటీసులుఉపాధి హామీ చట్టం కింద పంచాయతీ సర్పంచ్‌లతో సంబంధం లేకుండా పనులు చేపడుతున్న తీరుపై వైసిపికి చెందిన సర్పంచులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. గత రెండు నెలలుగా ఈ చట్టంలో వున్న మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని వారు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. దీనిపై కలెక్టర్‌ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరుబాట పట్టారు. పాచిపెంట మండలం కేసలి పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల తీర్మానం మేరకు కలెక్టర్‌, డ్వామా పీడీ, గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ జిల్లా అధికారులు, డిఇ, ఎఇలకు లీగల్‌ నోటీసులు పంపించారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. పాచిపెంట మండలం యర్రడ్లవలస నుంచి కుమ్మరివలస వరకు ఉపాధి హామీ చట్టం కింద రూ.2కోట్లతో బిటి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్‌తో పనులు ప్రారంభించారు. పాచిపెంట బిటి రోడ్డు నుంచి యర్రడ్లవలస వరకు రూ.1.6 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్‌ సుతాపల్లి సాంబమూర్తి పనులు ప్రారంభించారు. స్థానిక పంచాయతీ సర్పంచ్‌ ఆధ్వర్యాన పంచాయతీ తీర్మానం లేకుండా స్థానికేతురుడైన కాంట్రాక్టర్‌ సుతాపల్లి సాంబమూర్తితో అధికారులు పనులు చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ సర్పంచ్‌ సత్తారపు నిర్మల, వార్డు సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అదేబాటలో సాలూరు మండలానికి చెందిన వైసిపి సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సోమవారం ఎంపిడిఒ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ చట్టానికి లోబడి పనులు జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా మండలంలో పంచాయతీల గ్రామసభల ఆమోదం లేకుండా కొన్ని పనులను గ్రామసభల తీర్మానాల్లో ఇరికించాలని పంచాయతీ కార్యదర్శులపై ఎపిఒ రామకృష్ణ ఒత్తిడి చేస్తున్నారని, తలొగ్గని కార్యదర్శులను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎపిఒపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ నాయకత్వంలో మెజారిటీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఫిర్యాదులను ఎంపిడిఒ అందజేశారు. ఇదే దారిలో జిల్లాలో వైసిపి ప్రాబల్యం ఉన్న సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఎంపిపిలు పోరాటానికి సిద్ధమయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

➡️