గుమ్మలక్ష్మీపురం : టవర్లు నిర్మించి మధ్యలో నిలిపివేయడం అన్యాయమని సిపిఎం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.రామస్వామి అన్నారు. మండలంలోని గొయిపాక పంచాయతీ కుంతేసులో శాఖ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ గొయిపాక పంచాయతీ కుంతేసులో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడిచినా నేటికీ పూర్తి చేయకపోవడం అన్యాయమ న్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ నెట్వర్క్ పక్కనే ఉన్నప్పటికీ కనీసం సిగల్ అందడంలేదని, జియో నెట్వర్క్ కంటికి కానరాని దూరంలో ఉన్నప్పటికీ పుష్కలంగా సిగల్ అందుతుందని దీనికి కారణం నేటి ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే నిదర్శనమని అన్నారు. నెట్వర్క్ లను అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికార ప్రకటనలు, ఆచరణలో శూన్యమని మండిపడ్డారు. బిఎస్‌ఎన్‌ఎల్ నెట్వర్క్ అందకపోవడంతో కార్పొరేట్ నెట్వర్క్ రీఛార్జ్‌లు విపరీతంగా పెంచడంతో పూర్తిగా నెట్వర్క్ వినియోగం లేకుండా పోతుందని వివరించారు. కావున, వెంటనే మధ్యలో నిలిపివేసిన బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ పనులను పూర్తి చేసి, నెట్వర్క్ అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రాజశేఖర్, గొయిపాక శాఖ సభ్యులు ఎం. తిరుపతిరావు, వెంకటరావు, ఎం.రెడ్డిరావు, శంభు, తిరుపతి పాల్గొన్నారు.
