రెండు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుకు అవకాశం

Mar 25,2025 21:43

సిఎంకు వివరించిన కలెక్టర్‌

ప్రజాశక్తి – పార్వతీపురం: జిల్లాలో రెండు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు చేసేందుకు అవకాశం ఉందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగింది. తొలి రోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిమ్మగుడ్డి పంట సాగుకు జిల్లా అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది వేయి ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వచ్చే ఏడాదికి రెండు వేల ఎకరాల్లో సాగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒడిశాలోని రైతులు వేల ఎకరాల్లో లెమన్‌ గ్రాస్‌తో పాటు అంతర్‌ పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారని, ఆ దిశగా జిల్లాలోని రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వేయి ఎకరాల్లో నిమ్మగడ్డితో పాటు 4,240 హెక్టర్లలో అంతర్‌ పంటలు ( ఇతర పంటలు,) సాగు చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నిమ్మగడ్డి, ఇతర పంటలను సాగుచేసేకొనేలా ప్రోత్సహించేందుకు రైతులను ఎక్స్‌పోజర్‌ విజిట్‌ కు తీసుకువెళ్లినట్లు కలెక్టర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు అనుకూలమైన ఇంటర్‌ క్రాప్స్‌పై దృష్టి సారించాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కలెక్టర్‌కు సూచించారు.

➡️