ప్రజాశక్తి – కురుపాం : కురుపాం మన్యంలో చలితీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రాత్రివేళల్లో 13 నుంచి 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు రోడ్లపై మంచుదుప్పటి వీడటం లేదు. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. తీసుకునే ఆహారం నుంచి ధరించే దుస్తుల వరకు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. చలిలో తిరగడం వల్ల న్యూమోనియాతోపాటు వ్యాధులు, అలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉందని, ఆస్తమా వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చల్లగాలిలో ఉదయపు నడకకు వెళ్తే ఆస్తమా ఉన్నవారు శ్వాస సరిగ్గా తీసుకోవడం కష్టమంటున్నారు. మంచు ప్రభావం తగ్గిన తరువాత వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.