ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులంతా తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆకాంక్షించారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. విశాఖపట్నంలోని పర్యటించే ప్రాంతాల్లో కొత్త విషయాలను తెలుసుకొని విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు నాంధి పలకాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలానికి మూడు పాఠశాలలు చొప్పున జిల్లాలోని 45 మంది విద్యార్థులు ఈ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు బయలుదేరినట్లు డిఇఒ డాక్టర్‌ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు ఉన్నారు.ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలిఅవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. అటవీ శాఖ కార్యకలాపాలపై తన కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. రహదారుల వెంబడి, చెరువుల చుట్టూ ప్లాంటేషన్, గ్రామాల్లో చెట్ల పెంపకానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, సీడ్ బాల్స్ తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ, విఎస్‌ఎస్‌ల ద్వారా ప్లాంటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. జిల్లాలో చిత్తడి నేలల సరిహద్దులు, వాటి నోటిఫికేషన్‌పై సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అర్తం, నగరవాటిక వద్ద నగర వనాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు జిల్లా అటవీ అధికారి జిఎపి ప్రసూన తెలిపారు. పంట నష్ట పరిహారాన్ని విడుదల చేశా మన్నారు. సమావేశంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.సమిష్టి భాగస్వామ్యంతో స్వచ్ఛ సుందర పార్వతీపురం కావాలిస్వచ్ఛ సుందర పార్వతీపురంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంధ్రా – స్వర్ణంధ్రా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సుందర పార్వతీపురంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన ఛాంబరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించాలన్నారు. ర్యాలీ అనంతరం అక్కడ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్చంద, ఇతర సంస్థలు భాగస్వామ్యమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమష్టి భాగస్వా మ్యం స్వచ్ఛ సుందర పార్వతీపురం సాధ్యమని, దీనిపై ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. ర్యాలీ, సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు బాధ్యతతో నిర్వర్తించాల ని అన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డ్వామా పీడీ కె.రామ చంద్రరావు, మునిసిపల్ కమిషనర్ సిహెచ్. వెంకటేశ్వర్లు, డీఎల్డీఓలు, అధికారులు పాల్గొన్నారు.
