ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ దృష్టి లోపాల పరీక్షలను నిర్వహించుకొని, వాటిని సరిచేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, స్థానిక లయన్స్ కల్యాణ మండపంలలో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కంటి పరీక్షల్లో పాల్గొని తమ కళ్లను పరీక్షించుకున్నారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ దష్టి లోపాలు ఉన్న వారంతా తమ లోపాలను సరిచేసుకునేందుకు ఇదొక సదావకాశమన్నారు. దృష్టి లోపాలున్న వారికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, ఉచిత పరీక్షలను చేయడంతో పాటు అవసరమైతే శస్త్రచికిత్సలు నిర్వహించి, కంటి అద్దాలను కూడా అందిస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై తమ కంటి పరీక్షలు నిర్వహించుకొని, లోపాలను సవరించుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వైద్యాధికారులు, లయన్స్ ప్రాజెక్ట్ చైర్మన్ డా.జి.వాసుదేవరావు, కన్వీనర్ డా.యన్ దుర్గాప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సంస్కృత భాష గొప్పదనాన్ని అందరికీ చాటాలిపార్వతీపురంరూరల్: సంస్కృతం గొప్పతనాన్ని అందరికీ చాటాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ సంస్కృత ఉన్నత పాఠశాలలో గురువారం స్వామి వివేకానంద విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతత భాష చాలా గొప్పదని, భాషను నిలుపుకోవలసిన అవసరం జాతికి ఎంతైనా ఉందని అన్నారు. స్వామి వివేకానందుని బోధనలు ప్రతివారూ ఆచరించదగ్గవన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పలు శ్లోకాలను విద్యార్థులు చదవగా వారిని అభినందించారు. 10వ తరగతి విద్యార్థులకు వాసవి మాత దీవెనగా క్లబ్ కోశాధికారి వరద ఉదరు కుమార్ సమకూర్చిన అట్టలను, పెన్నులను, స్కేళ్ళను, పెన్సిల్ లను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎన్‌బి రావు 12 కుర్చీలను కలెక్టర్ ద్వారా పాఠశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. తిరుపతి నాయుడు, మండల విద్యాశాఖాధికారులు వై.విమల కుమారి, కె.ప్రసాదరావు, పాఠశాల హెచ్.ఎం. గోర్జ హేమ సుందరావునాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి : కలెక్టర్‌పార్వతీపురం టౌన్: పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాకు మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. స్థానిక డివిఎం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా టెన్త్ పరీక్షలు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల గురించి ఆందోళన చెందొద్దని, పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని అన్నారు. ప్రతి విద్యార్థిలో సంగ్రాహక శక్తి ఉందని, దాన్ని సరైన పద్దతిలో ఉపయోగిస్తే విజయం వరిస్తుందని అన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పెన్ను, ప్లాంక్, వివేకానందుని ఫోటోను విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుపతి నాయుడు, పాఠశాల ప్రధానోపాద్యాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
