ప్రజాశక్తి – పార్వతీపురం : జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు వినియోగిస్తున్న స్నిఫర్ డాగ్స్, ఎన్ఫోర్స్మెంట్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సిసి కెమెరాలను వినియోగించుకోవాలని సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా, నివారణకు పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖలతో జాయింటు ఆపరేషను నిర్వహించాలని తెలిపారు. బస్సులు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టాలన్నారు. చెక్ పోస్టులు వద్ద సిసి కెమెరాలు, డ్రోన్లను వినియోగించి నిఘా మరింత పెంచాలని తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారికి విధిగా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల అక్రమ రవాణా చేసే వారికీ వేసే శిక్షలు గుర్తించి అందరికీ తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతం గుండా జరిగే రవాణాకు అటవీ శాఖ అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. విద్యా సంస్థల వద్ద అవగాహన కల్పించాలన్నారు. విద్యా సంస్థల దగ్గరలో గల షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్దంగా విక్రయాలు జరిపే షాపులను మూసివేయించాలని తెలిపారు. నాటు సారా తయారుచేసే వారిపై తనిఖీలు నిర్వహించి, పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను రూపు మాపడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా మీదుగా రవాణా జరుగకుండా అన్ని శాఖలు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అవసరమైన చోట స్నిఫర్ డాగ్స్, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఎఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్, పాలకొండ డిఎస్పీ రాంబాబు, డిఎఫ్‌ఒ జిఎపి ప్రసూన, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.