రాజ్యాంగం జాతికి మార్గ నిర్దేశం : కలెక్టర్‌

Nov 26,2024 21:38

ప్రజాశక్తి – పార్వతీపురం : రాజ్యాంగం జాతికి మార్గ నిర్దేశనం అని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళ వారం నిర్వహించారు. డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ సుస్థిర మనుగడకు రాజ్యాంగ పీఠిక ఆధారమని అన్నారు. రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ను దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే దీనికి కారణం భారత రాజ్యాంగమేనని, ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించడానికి రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న అంశాలే ప్రధాన కారణమని తెలిపారు. అంబేద్కర్‌ సారధిగా ఏర్పాటైన డ్రాఫ్టింగ్‌ కమిటీ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందిం చడంలో ఎంతగానో శ్రమించారని, మనం అంతా గర్వించ దగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవిశ్రాంతం గా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుని చక్కటి జీవనానికి బాటలు చేసుకోవాలని చెప్పారు. అనంతరం రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిఇఒ ఎన్‌.తిరుపతి నాయుడు, కలెక్టరేట్‌ ఎఒ సావిత్రి, విభాగ అధిపతులు శ్రీరామ్మూర్తి, జయ, రాధాకృష్ణపాల్గొన్నారు.సీతంపేట: స్థానిక ఐటిడిఏ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్ర మాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో గల బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఎఒ సునీల్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం రాజ్యాంగంలోని పీఠిక ప్రతిజ్ఞను ఉద్యోగులు అందరూ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, వెలుగు ఎపిడి సన్యాసిరావు, డిఎస్‌ఒ అప్పారావు, డిప్యూటీ డిఇఒ నారాయడు, ఎఎంఒ కోటిబాబు, జిసిడిఒ రాములమ్మ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️