ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : రాష్ట్రస్థాయి పెయింటింగ్స్, ఆర్ట్స్ పోటీల్లో స్థానిక ఐటిడిఎకు ప్రథమ స్థానం లభించింది. బుధవారం విశాఖలో జరిగిన జన్ జాతీయ గౌరవ దివాస్ గిరిజన స్వాభిమాన వేడుకలు 2025 స్టేట్ లెవెల్ ట్రైబల్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ కాంపిటేషన్‌లో పార్వతీపురం ఐటిడిఎకు ప్రథమ స్థానం బహుమతి లభించింది. సీనియర్ విభాగంలో మొదటి బహుమతి గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన మండంగి బాలచంద్రుడుకు రూ.10వేలు నగదుతో పాటు ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు. అలాగే జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి టిక్కబాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన ఆరిక రాజేష్, (9 వ తరగతి)కు రూ.5వేలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు. స్పెషల్ బహుమతి ఆరిక గౌతమ్‌కు రూ.వెయ్యితో పాటు, షీల్డ్, ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే కన్సోలేషన్ బహుమతి కురుపాం ఎపి మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న ఆరిక అన్వితకు వెయ్యి రూపాయలు, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ మేరకు ఐటిడిఎ లైజెన్ ఆఫీసర్, డ్రాయింగ్ టీచర్ రుగడ శ్రీనివాసరావు తెలిపారు. బహుమతులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మందారా రాణి అందజేశారన్నారు.
