ప్రజాశక్తి – కొమరాడ : ఇటీవల పంచాయతీల ఖాతాలో జమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టకుండా దుర్వినియోగం చేసినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మండలంలో ఒక ఈ పంచాయతీకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ తన ఖాతాలో లక్షల రూపాయల నిధులు అన్ని పంచాయతీల నుంచి జమ కావడం పట్ల జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేని పంచాయతీ విస్తరణాధికారి నిర్వాకమే దీనికి కారణమంటూ అధికారులు అంటున్నారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీల కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను ఎం-బుక్‌తో పాటు రికార్డుల్లో నమోదు చేసి సంబంధిత వెండర్‌కు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే ఇక్కడ అధికారుల పర్యవేక్షణా లోపం వల్ల ఆ నిధులను పూర్తిస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఇఒపిఆర్‌డి, ఓ కంప్యూటర్ ఆపరేటర్ కలిసి పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా పంచాయతీలకు సంబంధించి రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పనుల పేరిట సుమారు రూ.20 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక సంఖ్యలో ఆయా పంచాయతీల్లో శానిటేషన్, మంచినీటి సరఫరా ఇలా చిన్నచిన్న పనుల కోసం వచ్చిన నిధులను ఒక కంప్యూటర్ ఆపరేటర్ తన ఖాతాలోకి గత రెండేళ్లుగా జమ చేస్తూ వచ్చిన డబ్బులను అందరూ కలసి సర్దుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో ఆర్తాం, చినఖెర్జీల, చోళ్లపదం, దళాయిపేట, దోవుకొన, దుగ్గి, గంగరేగువలస, గుమడ, గుణద తీలేసు, గుణానపురం, కంబవలస, కెమిశీల, కొట్టు, కుంతేసు ,మాదిలింగి, మసీమండ, పాలెం, పెద శాఖ, పుడేడు, శివినీ, తొడుము, వన్నం పంచాయతీల నుంచి 2023-24లో కల్లికోట పంచాయతీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మహిళ అకౌంటుకు రూ.5,83,493 జమైనట్లు రికార్డుల్లో తేలింది. 2024-25 ఏడాదికి సంబంధించి పైనున్న ఆయా పంచాయతీల్లో రూ.11.77354 సొమ్ము ఈ పంచాయతీ ఆపరేటర్ ఖాతాలో జమైనట్లు రికార్డుల్లో నమోదైంది. ఏకంగా ఒక పంచాయతీకి చెందిన ఆపరేటర్‌కు అన్ని పంచాయతీల నిధులు వ్యక్తిగత ఖాతాకు జమ కావడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. పంచాయతీలో పనులు జరగకుండా భారీ మొత్తంలో పనులు జరిగినట్లు తప్పుడు రికార్డులు చేసి నిధులు స్వాహా చేసుంటారని ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులకు ఎటువంటి బిల్లులు చెల్లింపులు చేయాలన్న ఆయా పంచాయతీ కార్యదర్శుల వద్ద ఉన్న డిజిటల్ కీ ఒక కాంట్రాక్టర్ ఉద్యోగైన ఆపరేటర్ వద్ద ఉంచుతూ నిర్లక్ష్యంగా ఇన్ని రోజులు పనులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఇప్పటికే గత రెండు రోజులుగా మండలంలో చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఈ అవినీతిపై స్పందించి దుర్వినియోగమైన నిధులను పూర్తిస్థాయిలో రికవరీ చేసి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపిడిఒ మల్లికార్జునరావు, పంచాయతీ విస్తరణ అధికారి రాధాకృష్ణను పజాశక్తి వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
