ప్రజాశక్తి-మక్కువ : అంత్యక్రియలకు పడరాని పాట్లు పడుతున్నామని యానాద కుటుంబీకులు సిపిఎం బృందం వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు ఉపయోగించే శ్మశానవాటికను వినియోగించు కునేందుకు అవకాశం కల్పించాలని మొరపెట్టుకున్నారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని వెంకట బైరిపురం గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించారు. యానాది వీధిలో స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. గతంలో నదీ తీరాన తాము వినియోగించే శ్మశానవాటిక ఆక్రమణకు గురైందని యానాదులు వాపోయారు. దీంతో అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. గ్రామస్తులంతా వినియోగించే శ్మశానవాటికను తాము కూడా వినియోగించుకునేందుకు హక్కు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు రెడ్డి వేణు మాట్లాడుతూ గ్రామస్తుల శ్మశానంలో యానాది కుటుంబాలకు అవకాశం కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సమస్యపై అధికారులకు వినతులు అందిస్తామని, అప్పటికీ స్పందించకుంటే పోరాట కార్యాచరణ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, నాయకులు పిట్టల చినబాబు, సీతారాం, చంటి, ఎం.గోపాల్, తదితరులు పాల్గొన్నారు.ఇంటిగ్రేటెడ్ వసతిగృహంగా మార్చాలిబలిజిపేట : స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో ఆర్‌ఎంఎస్‌ఎ నిధులతో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని ఇంటిగ్రేటెడ్ వసతిగృహంగా మార్చాలని సిపిఎం జిల్లా నాయకులు రెడ్డి వేణు కోరారు. ఆదివారం ఆ వసతిగృహ భవనాన్ని సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంతోపాటు ఇతర మండలాల నుంచి ఇంటర్, పాఠశాల విద్యకు వస్తున్న విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశమని చెప్పారు. ఈ భవనాన్ని నిర్మించి సుమారు ఆరేళ్లు కావస్తున్నా అధికారులు దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. లోపల గదులు ఖాళీలుగా ఉండడం, పిచ్చిమొక్కలు పెరిగాయని చెప్పారు. ఐరన్ టేబుళ్లను బయట కుప్పలుగా వేయడం ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగ పరచడమేనని తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సిపిఎం నాయకులు మన్మథరావు, మురళి, లక్ష్మి, ఈశ్వరరావు, సుధ, తదితరులు పాల్గొన్నారు.
