సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

Mar 13,2025 21:04

సాలూరు రూరల్‌: పురపాలక సంఘంలో కార్మిక సమస్యలు పరిష్కరించడంలో పాలకవర్గం పూర్తిగా విఫలమైందని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శి రాముడు, శంకర్‌ తెలిపారు. గురువారం నాలుగవ రోజు కార్మికుల సమ్మెను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క సాలూరు పురపాలక సంఘంలో మాత్రమే కార్మికులు జీతాలు చెల్లించని పరిస్థితి ఉందని కార్మికులకు కనీస అవసరాలైన పనిముట్లు లేవని, సబ్బులు, చెప్పులు, నూనెలు లేవని చెప్పారు. కార్మికులతో పని చేయించుకుంటున్నప్పుడు వారి కష్టసుఖాలు చూడాల్సిన పాలకవర్గం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలను గాలికి వదిలేసారన్నారు. మున్సిపాలిటీలో 29 వార్డులలో ప్రజలందరికీ సేవ చేస్తున్న కార్మిక సమస్యలు చర్చించేందుకు పాలకవర్గ సమావేశం నిర్వహించాలని వారికి రావలసిన బెనిఫిట్స్‌ వెంటనే ఇవ్వాలని అంతవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. అధికారులు పాలకుల మెప్పు కోసం స్పందించుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలరాజు, తాడు రాజు, వెంకన్న, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️