ఆదర్శం.. మహాత్ముని జీవితం

Oct 2,2024 21:41

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌: ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలని జాతిపిత గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అందుకే మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శమన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని తహశీల్దారు కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో ఉద్యమించి, బానిస సంకెళ్లు తెంచి, బ్రిటిష్‌ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికీ ఆదర్శనీయం, అనుసరణీయమని చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఈ నెల 5వ తేదీన మహిళా రక్షణ అవగాహన కార్యక్రమాన్ని సాలూరులో నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌, టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది చిట్టి, భీమారావు, పరమేశ్‌, శ్యామ్‌, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️