న్యాయానికి తూట్లు

Feb 3,2025 21:26

బలిజిపేట: కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి… పంతాన్ని పెట్టుబడిగా పెట్టి ఎన్నికల నిబంధనలను అధికార పార్టీ నాయకులు తుంగలో తొక్కి పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను, స్లీపర్‌, నైట్‌ వాచ్‌మేన్‌లను అన్యాయంగా తొలగించారు. గిరిజన, రజక సామాజిక వర్గానికి చెందిన వీరి కడుపుకొట్టారు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినప్పటి నుంచి సుమారు 24 ఏళ్లుగా అప్పులు చేసి మదుపు పెడుతూ ఆ పథకాన్ని ముందుకు నడిపించారు. కష్టం, నష్టంలో వారి జీవితాల్లో ఏదో ఒక రోజు మంచి రోజు వస్తాదని ఎదురు చూశారు. అదే సమయంలో స్థానిక, మండల రాజకీయ రాబంధులు వారిపై కన్నెర్ర చేసి కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పేదలైన కార్మికులను విధుల నుండి తొలగించారు. అంతటితో ఆగక ఎన్నో ఏళ్లుగాఅన్యోన్యంగా ఉన్న రజక, గిరిజన మత్స్యకారుల మధ్య కులాల కుంపటి రాజేశారు. మండలంలోని అరసాడలో చోటు చేసుకున్న ఈ పరిణామాల పట్ల ప్రజలు విస్తుపోతున్నారు.అరసాడలోని ఎంపిపి, జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలలో కొట్టిశ కళావతి, గొడవ పార్వతి, అరసాడ ఈశ్వరమ్మ,, గొడవ చినపార్వతి, అరసాడ అప్పిశెట్టి మధ్యాహ్న భోజన కార్మికులుగానూ, స్వీపర్‌, నైట్‌వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తను గత వైసిపి హయాంలో తొలగించారు. ప్రస్తుతం టిడిపి అధికారంలోకి వచ్చాక ఆ గ్రామానికి చెందిన టిడిపికి చెందిన వారికి పాఠశాలల్లోని చోటు కల్పించేందుకు దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిపై ఒత్తిడి చేశారు. ఈ మేరకు ఆ గ్రామస్థాయి నాయకుడు, మండల నాయకులను, ఎమ్మెల్యేలను ఉసిగొల్పి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై దాడులకు పాల్పడ్డారు. ఆఖరుకు పాఠశాల ఎస్‌ఎంసి కమిటీ, మండల త్రీమెన్‌ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే, మండల, గ్రామ రాజకీయ నాయకులు వీరిని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. మూడు నెలల నుంచి రాజకీయ నాయకుల ఒత్తిడికి గురైన వారంతా తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అధికారుల వద్దకు వెళ్తే ఎమ్మెల్యే ఒత్తిడితో వారు ఏమీ అనలేక చివరికి ఈ విషయాన్ని నీరు గార్చేశారని అన్నారు. తమను తొలగించొద్దని గ్రామ పెద్దలను, రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేను కోరినా స్పందించలేదు. ఆఖరుకు వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జనవరి 8న కోర్టు ఫైనల్‌ ఆర్డర్డ్‌ డిక్లేర్‌ చేసింది. జనవరి 29న సైన్డ్‌ కాఫీని పంపించింది. ఈ ఉత్తర్వు కాపీ జిరాక్సులను తహశీల్దార్‌, ఎంపిడిఒ, ఎంఇఒలకు బాధితులు అందజేసినప్పటికీ కోర్టు ఉత్తర్వులను వారు పక్కన పెట్టారు. ఎంఇఒ శ్రీనివాసరావు స్పందించినట్లు స్పందించి ప్రలోభాలకు లొంగి మళ్లీ వారిని తొలగించాలని ఎంపిపి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెప్పడం గమనార్హం. మండల, గ్రామ స్థాయి రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ స్పందించకుండా ఒకపక్క కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికలు నిబంధనలు ఉన్నాయని ఎంపిపి పాఠశాల హెచ్‌ఎం కూడా తాము విధి నిర్వహణలో లేని సమయంలో వారిని తొలగిస్తున్నట్లు ఈనెల 1న తీర్మానం చేసేశారు. ఈ విషయమై కోర్టు ధిక్కార కేసు కింద వెళ్తామని, తమకు జిల్లా అధికారులు, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఆధారంగా మళ్లీ విధులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

➡️